Holi 2026: హోలీ రంగులు చల్లుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఈ వార్తాకథనం ఏంటి
రంగుల సంబరంగా గుర్తింపు పొందిన హోలీ పండుగ వస్తుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మార్చి 3న ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకోనున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపే ఈ వేడుక అందరికీ ఎంతో ఇష్టం. అయితే, రంగుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. సహజ రంగులు కాకుండా రసాయనాలు కలిగిన రంగులు లేదా చర్మంపై ఎక్కువసేపు అంటుకునే రంగులు కళ్లకు, చర్మానికి హానికరంగా మారే అవకాశముంది. ముఖ్యంగా శరీరంలోని సున్నిత భాగాలకు ఈ రసాయనాలు తాకితే సమస్యలు తలెత్తవచ్చు. హోలీ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డెర్మటాలజిస్ట్' లు కొన్ని సూచనలు చేస్తున్నారు.
వివరాలు
హోలీ ఆడేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముందుగా శరీరమంతా నూనె రాసుకోవాలి. జుట్టుకూ బాగా నూనె పట్టాలి.
శరీరంపై గాయాలు ఉంటే వాటిపై తప్పనిసరిగా బ్యాండేజ్ వేయాలి. ఇలా చేస్తే రంగులు గాయాల్లోకి చేరకుండా ఉంటుంది. సహజ రంగులు ఉపయోగించినా ఈ జాగ్రత్త అవసరం.
ముఖంపై దద్దుర్లు, తామర లేదా ఇతర చర్మ సమస్యలు ఉంటే ముందుగా సంబంధిత ఆయింట్మెంట్ రాసి, ఆ తరువాత నూనె ఉపయోగించాలి.
మహిళలు, పురుషులు అందరూ ముందుగా సన్‌స్క్రీన్ లోషన్ రాసి, తరువాత నూనె అప్లై చేయాలి.
బాలికలు, మహిళలు గోళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్ వేసుకుంటే రంగులు గోళ్ల కుదుళ్లలోకి చొరబడవు.
వివరాలు
హోలీ ఆడుతున్న సమయంలో జాగ్రత్తలు
రంగులు నేరుగా కళ్లలో పడకుండా ఉండేందుకు కళ్లజోడు ధరించడం మంచిది.
కళ్లద్దాలు లేకపోయినా, రంగులు కళ్లకు తగలకుండా అప్రమత్తంగా ఉండాలి.
సాధారణ కాటన్ దుస్తులు లేదా పాత బట్టలు ధరించడం ఉత్తమం.
ఆ దుస్తులను తరువాతి రోజుల్లో ఉపయోగించకపోవడం మంచిది. అవసరమైతే వచ్చే ఏడాది కోసం భద్రపరచుకోవచ్చు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తెలియకుండానే రసాయనాలు కలిగిన రంగులు చల్లబడే అవకాశం ఉంది.
కొన్ని రంగుల వల్ల అలెర్జీ సమస్యలు తలెత్తవచ్చు.
అలాంటి పరిస్థితిలో వెంటనే ఆ ప్రదేశాన్ని నీటితో బాగా కడగాలి.
అలెర్జీ అనిపించిన చోట నీటితో శుభ్రం చేసిన తరువాత ఐస్‌తో మృదువుగా మర్దన చేయాలి లేదా పెరుగు రాయాలి. అలోవెరా జెల్ కూడా ఉపయోగించవచ్చు.
వివరాలు
హోలీ ముగిసిన తరువాత ఏమి చేయాలి?
కొన్ని రంగుల్లో అధిక రసాయనాలు ఉండటం వల్ల అవి త్వరగా తొలగిపోవు. ఎన్నిసార్లు కడిగినా రంగు తగ్గకపోవచ్చు. అలాంటి సందర్భంలో చర్మాన్ని బలంగా రుద్దకూడదు.
స్నానం చేసిన తరువాత రంగు పడిన ప్రదేశంలో అలోవెరా జెల్ లేదా పెరుగు రాసి 10-15నిమిషాలు ఉంచి,తరువాత శుభ్రం చేయాలి.
అయినా రంగు పూర్తిగా పోకపోతే, మళ్లీ అలోవెరా లేదా పెరుగుతోనే శుభ్రం చేయాలి. బ్లీచింగ్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం మంచిది కాదు.
రంగుల్లోని రసాయనాలు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.అందువల్ల హోలీ ఆడిన వెంటనే బ్యూటీ పార్లర్‌కు వెళ్లకూడదు. కనీసం ఐదు రోజుల విరామం ఇవ్వాలి.
అన్నింటికన్నా ముఖ్యంగా,హోలీ వేడుకలో పాల్గొనే ముందు తగినంత మంచినీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం.