LOADING...
Holi 2026 : హోలీ సంబరాలు సరే… కానీ రంగుల మరకలు ప్రమాదమే!
హోలీ సంబరాలు సరే… కానీ రంగుల మరకలు ప్రమాదమే!

Holi 2026 : హోలీ సంబరాలు సరే… కానీ రంగుల మరకలు ప్రమాదమే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ వేడుకల్లో కెమికల్ రంగులు చర్మానికి ప్రమాదకరం. అలాగని ఆర్గానిక్ రంగులతోనూ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. జుట్టు, చర్మం, బట్టలు... ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు చాలా మంది. కానీ నలుగురిలోకి వెళ్లి రంగుల్లో మునిగితేలేటప్పుడు అవన్నీ మరిచిపోతుంటాం. అందుకే హోలీ ఆడే ముందు నుంచే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నోరూరించే స్వీట్లు, మ్యూజిక్ హంగామా, రంగుల సందడి... దేశమంతా కులమతాలకతీతంగా జరుపుకునే హోలీ మనందరినీ ఒక్కటిగా కలిపే పండుగ. రంగులతో ఆడుకోవడం సరదానే. అయితే కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

Details

ముందస్తు జాగ్రత్తలు

ఆయిల్ పూత - జుట్టు, చర్మ రక్షణ హోలీకి ముందు రోజు రాత్రి జుట్టుకు కొబ్బరి నూనె రాయాలి. పండుగ రోజు ఉదయం మరోసారి నూనె రాస్తే ఇంకా బెటర్. మహిళలు జుట్టును ముడి వేయడం లేదా పోనీటెయిల్‌గా కట్టుకోవడం మంచిది. రంగులు పొడిబారిన చర్మానికి గట్టిగా అంటి చర్మరోగాలకు దారితీస్తాయి. కాబట్టి ఆడే ముందు రెండుసార్లు మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవాలి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మిశ్రమం చర్మంపై పొరలా పని చేసి రక్షిస్తుంది. చేతులు, కాళ్లకు పెట్రోలియం జెల్లీ రాయాలి. వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో సన్‌స్క్రీన్ తప్పనిసరి.

Details

ముఖ సంరక్షణ - నో ఫేషియల్

కొబ్బరి నూనెకు బదులుగా బేబీ ఆయిల్ రాసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే మరింత మంచిది. ఎన్‌పిఎఫ్ (NPF) 30 కంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. ఇది నీళ్లలో తడిసినా పోకుండా, ఎండ, దుమ్ము నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కనుబొమ్మలు, రెప్పలకు తేలికగా బేబీ ఆయిల్ రాయాలి. పెదాలకు లిప్‌బామ్ తప్పనిసరి. గోళ్లకు ముదురు రంగు నెయిల్ పాలిష్ వేసుకుంటే రంగులు లోపలికి చొరబడవు. హోలీకి ముందు ఫేషియల్, వాక్సింగ్ వంటి స్కిన్ ట్రీట్‌మెంట్లు చేయించుకోవద్దు. ఒకవేళ చేయించుకుంటే హోలీకి దూరంగా ఉండటం మంచిది. ఆడే ముందు ఎక్కువగా మంచినీళ్లు తాగితే చర్మం లోపలినుంచి తేమగా ఉంటుంది.

Advertisement

Details

దుస్తుల ఎంపికలో జాగ్రత్త

హోలీ రోజున చాలా మంది తెలుపు దుస్తులు ధరించడం ఆనవాయితీ. కొందరు ఒక్కసారి వేసి పడేసే దుస్తులు వాడుతారు. కానీ మళ్లీ వాడాల్సిన బట్టలు అయితే జాగ్రత్త అవసరం. పాతబట్టలు వేసుకోవడం మంచిదే కానీ అవి రంగులను ఎంతవరకు అడ్డుకుంటాయో చూడాలి. పూర్తి చేతులతో ఉండే (ఫుల్ స్లీవ్) దుస్తులు చర్మాన్ని కాపాడతాయి. కాటన్ బట్టలు ఉత్తమం. పాలిస్టర్ బట్టలు రంగును పీల్చకపోయినా, నీరు పోస్తే మళ్లీ రంగు ఒంటిపైకి జారిపోతుంది.

Advertisement

Details

మరకలు తొలగించేందుకు

హోలీ తర్వాత బట్టలను వేరువేరుగా ఉతకాలి. తడి ఆరకముందే ఉతకడం మంచిది. ఆక్సిజన్ బేస్డ్ బ్లీచ్ లేదా నాన్-క్లోరిన్ బ్లీచ్‌లో నానబెడితే మరకలు తగ్గుతాయి. చల్లని నీటినే ఉపయోగించాలి. చిన్న మరకలైతే వైట్ వెనిగర్, డిటర్జెంట్‌తో రుద్దితే పోతాయి.

Details

క్విక్ బాత్ తప్పనిసరి

హోలీ ఆడిన తర్వాత రంగులతో గంటల తరబడి తిరగకూడదు. ఎండలో ఎక్కువసేపు ఉంటే కెమికల్స్ చర్మానికి గట్టిగా అంటిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా స్నానం చేయాలి. పెట్రోల్, కిరోసిన్ వంటి పదార్థాలు ఉపయోగించకండి. ఇవి చర్మాన్ని మరింత పొడిబారుస్తాయి. * సాధారణ సబ్బుకు బదులుగా పిల్లల సబ్బు వాడటం మంచిది. స్నానం తర్వాత మళ్లీ మాయిశ్చరైజర్ రాయాలి. రంగుల్లో ఉండే మైకా, సీసం రేణువులు తలకు హాని చేస్తాయి. కాబట్టి షాంపూ చేసే ముందు జుట్టును బాగా నీటితో కడగాలి. ఆ తర్వాత సాఫ్ట్ లేదా మైల్డ్ షాంపూ ఉపయోగించాలి.

Details

కళ్లకు, నోటికి జాగ్రత్త

హోలీ రంగుల్లో కాపర్ సల్ఫేట్, మెర్క్యురీ, క్రోమియం వంటి రసాయనాలు ఉండొచ్చు. ఇవి కంట్లో పడినా, నోట్లోకి వెళ్లినా ప్రమాదకరం. కళ్లజోడు పెట్టుకుని హోలీ ఆడితే మంచిది. కంట్లో రంగు పడితే వెంటనే ఎక్కువ నీటితో కడగాలి. శుభ్రం చేసిన తర్వాత కూడా మండడం, నీరు కారడం, మసకగా కనిపించడం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Details

పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్త

పిల్లలు తేలికపాటి, సురక్షిత రంగులు మాత్రమే వాడేలా చూడాలి. ముఖంపై కాకుండా ఒంటిపై మాత్రమే రంగులు వేసుకోవాలని చెప్పాలి. కెమికల్ రంగులు చర్మానికి హాని చేసి, కళ్లలో పడితే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. రంగులు పూసుకునే సమయంలో గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. హోలీ ఆనందానికి ప్రతీక. అయితే కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ రంగుల పండుగను ఆరోగ్యంగా, సురక్షితంగా మరింత సంతోషంగా జరుపుకోవచ్చు.

Advertisement