Holi Colours Meaning: హోలీ రంగుల వెనుక ప్రత్యేకమైన అర్థం.. వాటిని తెలుసుకొని,ఎవరి మీద ఏ రంగు చల్లాలో నిర్ణయించుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశవ్యాప్తంగా ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ ఈసారి మార్చి 14 న జరగనుంది.
భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకూ తనదైన ప్రాముఖ్యత ఉంటుంది.
దీపావళిలో దీపాలు, సంక్రాంతికి ముగ్గులు, హోలీకి రంగులు—ఈ సంప్రదాయాలు లేకుండా పండుగల ఆనందం అసంపూర్ణంగా ఉంటాయి.
ప్రస్తుతం దేశమంతా హోలీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఇంట్లో రుచికరమైన వంటలు, స్వీట్లు తయారు చేసుకుంటూనే, ప్రియమైన వారిపై ప్రేమ, స్నేహానికి ప్రతీకగా రంగులు చల్లడానికి వివిధ రంగుల పౌడర్లు, స్ప్రేలు కొంటున్నారు.
అయితే, హోలీలో ఉపయోగించే రంగుల వెనుక ప్రత్యేకమైన అర్థం ఉందని మీకు తెలుసా? రంగుల అర్థాలను తెలుసుకొని, ఎవరి మీద ఏ రంగు వేయాలో నిర్ణయించుకోండి!
వివరాలు
హోలీ రంగుల వెనుక అర్థం
ఎరుపు రంగు:
ఎరుపు రంగు శక్తిని, ప్రేమను, వివాహ బంధాన్ని, సంతానోత్పత్తిని సూచిస్తుందని నమ్ముతారు. హోలీ రోజు, మీ జీవిత భాగస్వామికి లేదా ప్రియమైన వ్యక్తికి ఎరుపు రంగు గులాల్ చల్లడం మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది.
ఆకుపచ్చ రంగు:
వసంతకాలం ప్రారంభాన్ని, కొత్త జీవనోత్సాహాన్ని, ప్రకృతిని సూచించే రంగు ఆకుపచ్చ. ఇది హోలీ వేడుకల్లో ముఖ్యమైన రంగులలో ఒకటి.
ఆకుపచ్చ రంగు శాంతి, మనశ్శాంతి, అభివృద్ధిని సూచిస్తుంది. కొత్త సంబంధాన్ని మొదలుపెట్టాలనుకుంటే లేదా గతంలో మనస్పర్థలు వచ్చిన వ్యక్తిని మళ్లీ కలిసేందుకు ఈ రంగు చల్లండి.
వివరాలు
హోలీ రంగుల వెనుక అర్థం
గులాబీ రంగు:
గులాబీ రంగు ప్రేమ, స్నేహం, విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇది హోలీలో అత్యంత ప్రజాదరణ పొందిన రంగుల్లో ఒకటి. బంధువులు, స్నేహితులు, మిత్రులపై గులాబీ రంగును చల్లడం ద్వారా మీ స్నేహ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.
పసుపు రంగు:
పసుపు రంగు శాంతి,ఆరోగ్యం,ఆనందాన్ని సూచిస్తుంది. మీ గురువులు, ఉపాధ్యాయులు, పెద్దవారికి లేదా అత్యంత నమ్మకమైన మిత్రులకు పసుపు రంగును చల్లడం శుభప్రదంగా భావిస్తారు.
నీలం రంగు:
నీలం రంగు అపరిమితమైన విశ్వాన్ని సూచిస్తుంది. ఆత్మపరిశీలన, ప్రశాంతత, బలమైన మనోస్థైర్యాన్ని సూచించే ఈ రంగును మీ సహోద్యోగులు, స్నేహితులపై చల్లడం మంచి సంకేతంగా ఉంటుంది.
నారింజ రంగు:
కొత్త జీవితం ప్రారంభించాలనుకునేవారు,గత దోషాలను క్షమించాలని అనుకునేవారు నారింజ రంగును ఉపయోగించాలి.