Holi: హోలీకి సహజ రంగుల సందడి.. మహిళల హెర్బల్ గులాల్‌కు భారీ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగ హోలీ. అయితే ఈ పండుగలో ఉపయోగించే రంగుల వల్లే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి. మార్కెట్‌లో లభించే రంగుల్లో కలిపే రసాయనాలు చర్మానికి హానికరమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు రసాయన రహిత హెర్బల్ గులాల్ తయారీలో ముందంజ వేస్తున్నారు. పువ్వులు, ఆకుకూరలు వంటి సహజ పదార్థాలతో స్వచ్ఛమైన, పర్యావరణహిత హోలీ రంగులను తయారు చేస్తున్నారు.
Details
సహజసిద్ధమైన రంగుల తయారీ
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ పరిధిలోని మా దంతేశ్వరి స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు పూర్తిగా సహజసిద్ధమైన హోలీ రంగుల తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లా అధికారులు, లైఫ్ సైన్స్ సెంటర్ సహకారంతో పాలకూర, కొత్తిమీర, బంతి పువ్వులు, టెసు పువ్వులను ఉపయోగించి హెర్బల్ గులాల్ తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
Details
భారీ డిమాండ్
వీరు తయారు చేసే మూలికా గులాల్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. పూర్తిగా సేంద్రీయ విధానంలో తయారవ్వడంతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ రంగులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇప్పటికే దాదాపు 200 కిలోల హెర్బల్ గులాల్‌ను విక్రయించారు. ఇలా తయారు చేస్తారు పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరల నుంచి ఆకుపచ్చ రంగు, ఎరుపు పాలకూర, బీట్‌రూట్ నుంచి ఎరుపు రంగు, బంతి పువ్వుల నుంచి పసుపు రంగు, టెసు పువ్వుల నుంచి కుంకుమ రంగును సిద్ధం చేస్తున్నారు. ముందుగా ఈ ఆకులు, పువ్వులను ఎండబెట్టి, తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఈమొత్తం ప్రక్రియ రసాయన రహితంగా జరుగుతుంది. అందువల్ల ఈ సహజ రంగులు చర్మానికి ఎటువంటి నష్టం కలిగించవు.
Details
ప్రజలకు విజ్ఞప్తి
రాబోయే హోలీ సందర్భంగా మార్కెట్‌లో లభించే రసాయన రంగుల బదులు మూలికా గులాల్‌ను వినియోగించాలని ఈ మహిళలు ప్రజలను కోరుతున్నారు. రసాయనాలు కలిగిన రంగులు చర్మానికి హానికరమవడమే కాక, కళ్లలో పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రకృతి దీదీలుగా మారిన బీడీ కార్మికులు అదే విధంగా బిహార్‌లోని జముయి జిల్లాలోని మటియా గ్రామ మహిళలు కూడా ఆకుకూరలు, పువ్వులు, ఔషధ మొక్కలతో హెర్బల్ గులాల్ తయారుచేస్తున్నారు. అందుకే ఈ గ్రామాన్ని 'ప్రకృతి గ్రామం'గా పిలుస్తున్నారు. ఒకప్పుడు బీడీ కార్మికులుగా పని చేసిన ఈ మహిళలు ఇప్పుడు హోలీ రంగుల తయారీలో రాణిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు.
Details
మూడు సంవత్సరాలుగా ఇదే వృత్తి
గ్రామానికి చెందిన 10-15 మంది మహిళలు కలిసి ఒక బృందంగా ఏర్పడి గత మూడు సంవత్సరాలుగా ఈ రంగులను తయారు చేస్తున్నారు. మొదటి ఏడాది 6 క్వింటాళ్ల రంగులు ఉత్పత్తి చేయగా, ఈ సంవత్సరం ఇప్పటికే 50 క్వింటాళ్ల సహజ రంగుల ఆర్డర్ పొందారు. ఈ కార్యకలాపాల ద్వారా ప్రతి మహిళ నెలకు సుమారు రూ.6,000 సంపాదిస్తున్నారు. గతంలో బీడీలు చుట్టి రోజుకు రూ.50 నుంచి రూ.100 మాత్రమే పొందగలిగేవారు.
Details
తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
నేచర్ విలేజ్ వ్యవస్థాపకుడు, లక్ష్మీపుర్ మాజీ బీడీఓ నిర్భయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, ఈ మహిళలు తమ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందినట్లు తెలిపారు. కొందరిని విదేశాలకు శిక్షణ కోసం పంపినట్లు వెల్లడించారు. "ఒకప్పుడు రోజుకు రూ.50 కూడా సంపాదించలేని మహిళలు ఇప్పుడు 'ప్రకృతి దీదీ'లుగా గుర్తింపు పొందారు. హోలీ రంగుల తయారీతో వారి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. పొరుగు జిల్లాల నుంచి కూడా వారికి ఆర్డర్లు వస్తున్నాయి. త్వరలో నేచర్ దీదీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.