పోషకాలు: ఐరన్, విటమిన్ బీ12.. శరీరానికి సరిగ్గా అందకపోవడం వల్ల కలిగే నష్టాలు
ఐరన్, విటమిన్ బీ12.. ఈ రెండు ఖనిజాలు శరీరానికి సరిగ్గా అందకపోతే శరీరం సక్రమంగా పనిచేయదు. రక్తహీనత వల్ల వచ్చే అనేక ఇతర వ్యాధులను ఇవి దూరం చేస్తాయి. రక్తంలో హీమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. హీమోగ్లోబిన్ కావాల్సినంత ఉత్పత్తి కాకపోతే శరీర అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దానివల్ల సమస్యలు తలెత్తుతాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం, ఐరన్, విటమిన్ బీ12 లోపాలు శారీరక ఇబ్బందులనే కాదు మానసిక ఇబ్బందులైన యాంగ్జాయిటీ, ఒత్తిడిని తీసుకొస్తాయి. ఐరన్ లోపం వల్ల అలసట ఎక్కువ అవుతుంది. ఇంకా ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంది. దీన్నే రక్తహీనత అంటారు. ఈ వ్యాధి మగవారిలో కన్నా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది.
రక్తహీనత వల్ల వచ్చే ఇబ్బందులు
రక్తహీనత వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మెదడులో సెరెటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. అంతేకాదు రక్తహీనత, బీపీ పెరగడానికి కూడా కారణమవుతుంది. కండరాలు బలహీనంగా మారిపోవడం, శారీరక అలసట అనేవి విటమిన్ బీ12 లోపం వల్ల కలుగుతాయి. ఈ లోపం మీలో ఉంటే మీ శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. పాదాలు, అరచేతుల్లో జలదరింపులు కలగడం, నొప్పి, తిమ్మిరి వచ్చినట్టుగా అనిపించడం, చర్మం పసుపు రంగులోకి మారడం, కంటిచూపు తగ్గిపోవడం, తీవ్రమైన తలనొప్పి మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు కనిపించినపుడు వైద్యుడిని సంప్రదించి, టెస్టులు చేసుకుని మందులు వాడడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే ఐరన్, విటమిన్ బీ12 ని పెంచే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి.