పెట్: మీ పెంపుడు పిల్లికి మరో పిల్లితో దోస్తీ చేయించాలనుకుంటే చేయాల్సిన పనులు
మీకు పిల్లిని పెంచే అలవాటుంటే దానికి తోడుగా మరోపిల్లిని డైరెక్టుగా తీసుకురాకూడదని మీరు గుర్తుంచుకోవాలి. పిల్లులకు ఒక గుణం ఉంటుంది. మీరు చూపించే ప్రేమ, ఆకర్షణ వేరే పిల్లితో పంచుకుంటే అవి తట్టుకోలేవు. వాటిల్లో అవతలి పిల్లిపై కోపం పెరుగుతుంది. అందుకే మీ పిల్లికి మరో పిల్లిని పరిచయం చేయాలంటే ఒక పద్దతి ఫాలో కావాల్సి ఉంటుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. పిల్లిని వేరే గదిలో ఉంచండి: మీరు మరో పిల్లిని ఇంటికి తీసుకొద్దామనుకుంటే ముందుగా మీరు పెంచుకునే పిల్లిని వేరే గదిలో ఉంచాలి. మీరు తీసుకొచ్చే పిల్లికి ఆల్రెడీ మీ దగ్గరున్న పిల్లి కనిపించకూడదు. దీనివల్ల మీరు తెచ్చిన పిల్లి మీ ఇంటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది.
పెంపుడు పిల్లికి మరో పిల్లిని పరిచయం చేసే ముందు చేయాల్సిన పనులు
పరోక్షంగా తెలిసేలా చేయాలి: మీరు మరో పిల్లిని పెంచుతున్నారని పరోక్షంగా రెండు పిల్లులకు తెలిసేలా చేయాలి. అంటే రెండు పిల్లులను ఎక్కడో దూరపు గదుల్లో కాకుండా పక్కపక్కనే ఉన్న గదులో పెట్టాలి. ప్రదేశాలు తారుమారు: పిల్లులు వాసన ద్వారా అవతలి పిల్లి ఉనికిని పసిగట్టేస్తాయి. వేరే రూమ్ లోకి మారిన పిల్లికి ఆ గదిలో అంతకుముందు మరో పిల్లి ఉందని తెలుస్తుంది. పరిచయం: కొన్ని రోజులు గడిచిన తర్వాత రెండు పిల్లులను పరిచయం చేయాలి. అది కూడా ప్రత్యక్షంగా కాదు, ప్రత్యేక గదుల మధ్య ఒక తెల్లటి తెరను పెట్టి అవతలి వైపు పిల్లి కనబడేలా చేయాలి. అప్పుడు రెండు పిల్లుల్లో ఎలాంటి కోపం లేకపోతే ప్రత్యక్ష పరిచయం చేయవచ్చు.