డబ్బు గురించి పిల్లల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలో తెలుసుకోండి
డబ్బు ఉండడం కన్నా దాన్నెలా ఖర్చుపెట్టాలో తెలిసినవాళ్లే ఎక్కువ ఆనందంగా ఉంటారు. డబ్బు దాచుకోవడం, ఖర్చుపెట్టడమనేది ఒక కళ. ఆ కళ అందరికీ రాదు, నేర్చుకోవాల్సిందే. ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా డబ్బును మ్యానేజ్ చేసే స్థితికి చేరుకోవచ్చు. అందుకే మీరు మీ పిల్లలకు డబ్బుపై, దాన్ని ఖర్చు చేయడంపై అవగాహన కల్పించండి. మీ పిల్లలకు డబ్బు పాఠాలు ఏ విధంగా చెప్పాలంటే, ఇంట్లో సామాను కొనేటపుడు పిల్లలను తీసుకెళ్ళండి: సామాను కొనడానికి వెళ్లే ముందు ఇంట్లోనే బడ్జెట్ ఎంతవుతుందో లెక్క చేయండి. ఆ బడ్జెట్ లోనే ఇంటి సామాన్లు తీసుకురండి. ఇంకా, వివిధ రకాల ధరలను పోల్చి చూడండి. దానివల్ల పిల్లలకు ఏది కొనాలనే దానిపై ఒక అవగాహన వస్తుంది.
బ్యాంక్ అకౌంట్, స్టాక్స్, నెలనెలా డబ్బులు ఇవ్వడం వల్ల పిల్లలకు అర్థమయ్యే మనీ పాఠాలు
పిల్లలకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి: అకౌంట్ ఓపెన్ చేసే ముందు బ్యాంక్ ఎలా పనిచేస్తుందో, ఎలాంటి సేవలు దొరుకుతాయో తెలియజేయండి. డబ్బులు తీసుకోవడం, వేయడం ఎలాగో నేర్పించండి. ఆన్ లైన్ బ్యాంకింగ్ ఎలా వాడాలో చూపించండి. నెలనెలా కొన్ని డబ్బులు ఇవ్వండి: మీ పిల్లల వయసును బట్టి వారి అవసరాల కోసం నెలనెలా కొంత డబ్బు ఇవ్వండి. వారికి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ మొదలగు వస్తువులను వాళ్ళనే కొనమని చెప్పండి. దానివల్ల బేరమాడే నైపుణ్యం పెరుగుతుంది. స్టాక్స్ వైపు ఓ లుక్కేయండి: స్టాక్స్ గురించి ఎంత తొందరగా అవగాహన చేసుకుంటే అంత మంచిది. చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించండి. మొబైల్ లో మనీ గేమ్స్ ఆడించడం వల్ల కుడా ఫలితం ఉంటుంది.