Page Loader
Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!
తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!

Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులతో నడిచే ప్రయాణం. ఈ మార్గంలో ఎదుగుదల కోరేవాళ్ల కన్నా, కిందపడాలని ఆశించే వారే ఎక్కువగా ఎదురవుతారు. మనం పైకి రావాలని తీవ్రంగా కృషి చేస్తుంటే, బయటికి ముచ్చటగా మాట్లాడినా మన విజయాన్ని జీర్ణించుకోలేని వారు అనేకమంది ఉంటారు. ఇది వినడానికైతే చేదుగా అనిపించవచ్చు.. కానీ ఇది నిజం. మన ప్రయాణంలో ఎందరో మనకు తారసపడతారు. వారిలో కొందరు మన జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తారు, మరికొందరు మన మంచితనాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటారు. ఎందుకంటే మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. మీరు ఎంత మేలు చేసినా, ఎంత నమ్మకంగా ఉన్నా - కొన్నిసార్లు అదే మీ బలహీనతగా మిగిలిపోతుంది. నమ్మినవారే ద్రోహం చేస్తారు.

Details

మీ విలువను ఎవరూ తగ్గించలేరు

మీ అవసరం తీరిన తరువాత మిమ్మల్ని పక్కన పెడతారు. మీపైనే తప్పుదొర్లినట్లు బురదజల్లుతారు. మీ వ్యక్తిత్వాన్ని కించపరిచి, గౌరవాన్ని తుంచే ప్రయత్నం చేస్తారు. మీరు దిగజారాలన్న ఉద్దేశంతో వంచనలు చేస్తారు. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవలసిన విషయమొకటి: ఎవరైనా ఎన్ని చేసినా, మీ విలువను తగ్గించలేరు. మీరు ఎవరో, మీలో ఏముంది అనే విషయం మీకూ తెలుసు - గుర్తించగలవారికీ తెలుసు. ఒక్కరు మిమ్మల్ని తక్కువచేసే ప్రయత్నం చేస్తే, మీ స్థాయి తగ్గిపోయిందని కాదు. అవమానాలు, అపవాదులు తాత్కాలికమైన నీడలు మాత్రమే. కానీ నిజమైన కాంతి ఎప్పటికైనా బయటపడుతుంది. మీరు పొందాల్సిన గౌరవం, గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది.

Details

 ఓ చిన్న కథ ద్వారా ఈ నిజాన్ని మరింత అర్థమయ్యేలా చేద్దాం 

ఒకసారి గొప్ప పేరు పొందిన వ్యక్తి ప్రసంగించబోతున్నాడు. చాలా మంది అతని మాటలు వినటానికి ఓ పెద్ద హాలులో కూర్చున్నారు. వేదికపైకి వచ్చిన ఆ వ్యక్తి మాట్లాడుతూ - "మీరు నా మాటలు నిజంగా అర్థం చేసుకుంటే, మీ జీవితం మారుతుంది" అని చెప్తాడు. అనంతరం జేబులోంచి మెరుస్తున్న బంగారు నాణెం తీసి చూపించి, "ఈ నాణెం ఎవరికి కావాలి?" అని అడుగుతాడు. అందరూ చేతులు పైకి ఎత్తుతారు. ఆపై ఆయన అదే నాణెం నేలపై వేసి రుద్ది కొద్దిగా పాతపడినట్లు చేస్తాడు. మళ్లీ "ఇప్పుడైనా ఎవరికైనా కావాలా?" అని అడుగుతాడు. చేతులు మళ్లీ పైకి ఎగురుతాయి.

Details

బంగారం విలువ ఎప్పటికి తగ్గదు

ఆ నాణెన్ని వంచి వంకర చేస్తాడు. మురికి మట్టిలో వేస్తాడు. మళ్లీ అడుగుతాడు - "ఇప్పుడూ ఎవరికైనా కావాలా?" అనగా, మరోసారి కూడా అందరూ చేతులు పైకెత్తుతారు. అప్పుడు ఆ వ్యక్తి చెబుతుంది - "ఈ బంగారు నాణెం ఎంత తొక్కినా, ఎంత మురికిగా చేసినా దాని విలువ తగ్గలేదు. మీరు కూడా అలాగే. జీవితం మిమ్మల్ని కొట్టి పడేస్తుంది, అణచేస్తుంది, నెగటివ్‌గా మార్చే పరిణామాలు వస్తాయి. కానీ మీరు మేలిమి బంగారం. మీ విలువ ఎప్పటికీ తగ్గదు."

Details

సమయం వచ్చినప్పుడు ప్రపంచమే మీ విలువను గుర్తిస్తుంది

జీవితంలో మీకు అనేక అడ్డంకులు రావచ్చు - పరీక్షలో ఫెయిలవచ్చు, ఇంటర్వ్యూలో రిజెక్ట్ కావచ్చు, వ్యాపార నష్టాలు ఎదురవచ్చు, ప్రేమలో విఫలం కావచ్చు, పెళ్లి జరగకపోవచ్చు లేదా జరిగిన పెళ్లి చెడిపోయి ఉండొచ్చు. ఈ ప్రతికూలతలు మీ విలువను నిర్ణయించలేవు. మీరు ఎవరో తెలుసుకోండి - మీ విలువను గుర్తించండి. సమయం వచ్చినపుడు ప్రపంచమే మీ విలువను గుర్తిస్తుంది. మీరు విలువైనవారు. పరిస్థితులు తాత్కాలికం. స్ఫూర్తిని కోల్పోవద్దు. మీ కాలం వస్తే - ఆ వెలుగును ఆపలేరు.