రోజూ వ్యాయామం చేయాలంటే మీ ఆలోచనల్ని మార్చుకోండిలా..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం అవసరం. చాలామంది వాకింగ్, వ్యాయామాలు చేయాలని అనుకుంటారు. వారం రోజుల తర్వాత ఒళ్లునొప్పులుగా ఉన్నాయని వ్యాయామం చేయడం మానేస్తారు. ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితిని అధిగమించి రోజూ క్రమం తప్పకుండా చేయాలంటే మనం ఆలోచలన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ముందు మెదడులోంచి కొన్ని ఆలోచనల్ని తొలగించుకోవాలి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. నేను రోజంతా చాలా బిజీ బిజీగా ఉంటున్నాను. ఖాళీయే దొరకడం లేదు. నేను రోజు వారీ పనులతో బాగా అలసిపోతున్నాను. ఇంత బలహీనంగా ఉన్నప్పుడు వ్యాయామాలు అవసరమా?
వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి
ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్లాలి రోజూ వ్యాయామం చేయకపోతే నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నట్టు. దాన్ని మళ్లీ ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? అందరి కోసం నేను కష్టపడుతున్నా. రోజులో నాకోసం నేను ఈ సమయాన్ని కేటాయించుకోవాల్సిందే. నేను రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఒక్కరమే చేయాలంటే బోర్‌గా అనిపిస్తుంది. స్నేహితులకూ దీన్ని అలవాటు చేద్దాం. కలిసి చేయడం వల్ల వారి ఆరోగ్యమూ బాగుంటుంది. బంధాలూ మెరుగవుతాయి. ఒక్క వాకింగ్‌లు, జాకింగ్‌లు అనేముంది? ఆటలు, డ్యాన్సులతోనూ వ్యాయామం చేసేద్దాం. సరదా సరదా ఫిట్‌నెస్ యాక్టివిటీలను సృష్టించుకుందాం.