Kiwi Fruit: రోగనిరోధక శక్తిని పెంచే కివి పండు.. రోజుకు ఒక్కటి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
ఈ వార్తాకథనం ఏంటి
కివి పండ్లకు ప్రస్తుత రోజుల్లో మంచి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ప్రధానంగా సూపర్ మార్కెట్లలో మాత్రమే లభించే ఈ పండ్లు, ఇప్పుడు వీధి వ్యాపారులు కూడా విక్రయిస్తున్నారు.
ముఖ్యంగా డెంగీ, విష జ్వరాల సమయంలో ఎక్కువగా తీసుకోవడంతో కివి పండ్లకు ఆదరణ పెరిగింది.
అయితే ఈ పండ్లను కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
కివి పండ్లలో పలు శక్తివంతమైన పోషకాలు ఉండటంతో శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Details
జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరం
కివి పండ్లు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే ప్రీ-బయోటిక్ ఆహారాల్లో ఒకటి.
ఇవి జీర్ణాశయం, పేగులను శుభ్రంగా ఉంచుతూ, వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.
అందువల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కివిలో ఉండే యాక్టినైడిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడంలో సాయపడుతుంది.
ముఖ్యంగా అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తినే సమయంలో కివి పండును కూడా తీసుకుంటే, అజీర్తి సమస్య రాకుండా ఉండటానికి ఇది దోహదం చేస్తుంది.
Details
గుండె ఆరోగ్యానికి రక్షణ
కివి పండ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో రక్త సరఫరా మెరుగుపడి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది హైబీపీ నియంత్రణలో కూడా సాయపడుతుంది
అంతేకాక కివి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో గుండె పోటును అరికట్టే అవకాశం ఉంది.
ఈ పండ్లలో ఉండే అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించేందుకు తోడ్పడుతుంది.
దీని వల్ల అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు రోజూ కివి పండును తీసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
Details
చర్మ ఆరోగ్యానికి కివి
కివి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటంతో చర్మానికి మెరుగైన రక్షణ లభిస్తుంది.
ఇది చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా చేసి, వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది.
కివి పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
మొటిమల సమస్యతో బాధపడే వారు కివి పండును తినడం లేదా ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
Details
రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే కివి
కివి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దీని వలన సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ కె సమృద్ధిగా ఉండటంతో ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కలిగివుంటుంది.
నిద్రలేమి సమస్యకు పరిష్కారం
కివి పండ్లను తినడం ద్వారా మెదడు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి, రాత్రి పూట సౌకర్యంగా నిద్ర పడుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
అంతేకాక కివి పండ్లలో అనేక ఇతర పోషకాలు ఉండటంతో రోజూ తినడం ద్వారా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
కావున కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, ఆరోగ్య రీత్యా ప్రతిరోజూ ఒక కివి పండును తీసుకోవడం ఉత్తమం.