Free Gas Subsidy: ఏపీలో దీపావళి కానుకగా ఉచిత సిలిండర్ పథకం అమలు.. సబ్సిడీ సొమ్ము ఎలా పొందాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సూపర్ సిక్స్'లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించింది. దీని కింద, ఆ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఇకపై ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. దీపం-2 పథకానికి ప్రభుత్వం రూ.2,684 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో మొదటి విడతకు రూ.894 కోట్లను పెట్రోలియం సంస్థలకు అందచేశారు. దీంతో లబ్ధిదారులు ప్రతీ ఏడాదీ 3 ఉచిత సిలిండర్ల సౌకర్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 29వ తేదీ నుంచి ఈ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైంది. దిల్లీ సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్రోలియం సంస్థల ప్రతినిధులకు సబ్సిడీ చెక్కులను అందించారు. ఉచిత సిలిండర్ పొందాలంటే లబ్ధిదారులు రేషన్ కార్డు కలిగి ఉండాలి.
ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయాలి
అలాగే, లబ్ధిదారు పేరుతో గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు వివరాలు అనుసంధానం కావాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీ తర్వాత 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ నిధులను జమ చేస్తారు. పథకంలో భాగంగా మొదట లబ్ధిదారులు సిలిండర్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ అయిన 48 గంటల్లో సిలిండర్ ధరను రాయితీ రూపంలో వెనక్కి పొందే అవకాశం ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి రెండో విడత ప్రారంభమవుతుంది. ఈ కొత్త విడతకు సంబంధించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటి) వ్యవస్థలో మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం మార్పులు చేపట్టాలని యోచిస్తోంది.