LOADING...
Republic Day 2026: రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత?
భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత?

Republic Day 2026: రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యాపార లావాదేవీల నెపంతో భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటిష్‌ పాలకులు, అప్పటి భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు. రాజులు, సంస్థానాధిపతుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను అవకాశంగా మలిచిన ఆంగ్లేయులు, వారిని నెమ్మదిగా తమ అదుపులోకి తీసుకుని పాలనపై పట్టు సాధించారు. విభజించి పాలించు విధానాన్ని అనుసరించి,అనేక రాజ్యాలు-సంస్థానాలుగా విడిపోయిన భారతావనిపై క్రమంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు పరాయిపాలనను అనుభవించిన భరతమాతకు,దీర్ఘకాల పోరాటాల అనంతరం 1947లో స్వేచ్ఛ లభించింది. దేశ విముక్తి కోసం వేలాది మంది ప్రజలు తమ సంపదను,గౌరవాన్ని,ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అహింస అనే మార్గాన్ని ఆయుధంగా చేసుకున్న మహాత్మా గాంధీ, భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేశారు.

వివరాలు 

జనవరి 26న స్వతంత్ర భారతం గణతంత్ర రాజ్యంగా అవతరించింది

అయితే 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దేశానికి సంపూర్ణ స్వరాజ్యం 1950లోనే సిద్ధమైంది. స్వతంత్ర భారతం గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది.అదే రిపబ్లిక్ డే. కానీ ఈ దినం ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించని చాలామందికి ఇది ఒక సాధారణ సెలవు రోజుగానే మారింది. ఇంట్లోనే గడుపుతూ సినిమాలు చూడటం,విహారయాత్రలు,షాపింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి పోరాడిన మహనీయులను ఈ రోజున ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు? జాతీయ పండుగ రోజున వారి ఆశయాలను ఎంతమంది ఆచరిస్తున్నారు? నేటి యువతకు స్వాతంత్ర్య పోరాటంపై ఎంత అవగాహన ఉంది? అనే అంశాలపై సర్వే నిర్వహిస్తే, సిగ్గుతో తలవంచాల్సిన నిజాలు బయటపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వివరాలు 

జనవరి 26నే రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటారు?

రిపబ్లిక్ డేను ప్రత్యేకంగా జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారు? అనే ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అదే తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని చాలామంది భావిస్తారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ, దీని వెనుక మరింత బలమైన చారిత్రక కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అయితే దానిని అమల్లోకి తెచ్చే తేదీకి ప్రత్యేకమైన చరిత్ర ఉండాలన్న ఉద్దేశంతో రెండు నెలలు వేచిచూశారు.

Advertisement

వివరాలు 

లాహోర్ వేదికగా 1930లో పూర్ణ స్వరాజ్య తీర్మానం

1930 జనవరి 26న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో తొలిసారిగా 'పూర్ణ స్వరాజ్యం' తీర్మానాన్ని ప్రకటించారు. జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో రావీ నది తీరంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిష్ పాలకులకు స్పష్టంగా తెలియజేశారు. అప్పటివరకు పరిమిత స్వాతంత్ర్యం సరిపోతుందని భావించిన రాజకీయ నేతల ఆలోచనలకు, జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ ఒక్కసారిగా కళ్లు తెరిపించింది. సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, రాజాజీ వంటి నాయకులు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చలకు దారితీసి, సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదింపజేయడంలో విజయం సాధించారు. ఆ జనవరి 26ననే స్వాతంత్ర్య దినోత్సవంగా పాటించాలని దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

Advertisement

వివరాలు 

బ్రిటిష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం-1935 పూర్తిగా రద్దు 

అంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన తేదీకి శాశ్వత గుర్తింపునివ్వాలన్న సంకల్పంతో, రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, నవభారత నిర్మాతలు 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తీసుకొచ్చారు. 1950 జనవరి 26 నుంచి బ్రిటిష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం-1935 పూర్తిగా రద్దయ్యింది. అదే రోజున భారత్ సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. తరువాత కాలంలో 'లౌకిక' అనే పదం రాజ్యాంగంలో చేరింది. స్వాతంత్ర్యం అనంతరం దేశానికి ఒక సమగ్రమైన రాజ్యాంగం అవసరమని భావించిన దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దీనికి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

మొత్తం రూ.64 లక్షల వ్యయం 

భారత రాజ్యాంగ రూపకల్పనలో అనేకమంది మేధావులు ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ దీనిని ఆమోదించింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి రెండు సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు పట్టగా, మొత్తం రూ.64 లక్షలు వ్యయమయ్యాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం రాజ్యాంగానికి ప్రాథమిక ఆధారంగా నిలిచినా, అనేక అంశాలను ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి స్వీకరించారు. స్వాతంత్ర్య పోరాట ఆశయాలను కార్యరూపంలో పెట్టేందుకు, భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే లక్ష్యంతో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు.

వివరాలు 

అధికారిక పరేడ్‌కు సమాంతరంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ర్యాలీ

ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రోజునే భారత ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత, న్యాయం హక్కులుగా లభించాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక పరేడ్‌కు సమాంతరంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ర్యాలీ నిర్వహించడం విశేషంగా నిలిచింది. ప్రజల పోరాటంతో సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికుల పాత్ర లేకపోతే దేశానికి బలం ఉండేదే కాదని ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. స్వాతంత్ర్యం తెచ్చినవారు రైతులే, ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని నిలబెడుతున్నవారూ వారేనని వారు అంటున్నారు.

వివరాలు 

ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండా

తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారత తొలి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత పాత పార్లమెంట్ భవనంలోని దర్బార్ హాల్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో కర్తవ్య పథ్ వరకు ఐదు మైళ్ల మేర సాగిన పరేడ్ అనంతరం, ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పరాయి పాలనకు పూర్తిగా ముగింపు పలికి, అధికారాన్ని స్వయంగా చేపట్టిన ప్రతీకగా నిలిచింది రిపబ్లిక్ డే. స్వతంత్ర సార్వభౌమ దేశంగా భారత్ ప్రపంచ దేశాల సరసన గర్వంగా నిలిచిన ఘట్టమే గణతంత్ర దినోత్సవం.

Advertisement