కంటిచూపును, చర్మాన్ని, గుండెను కాపాడే ఆప్రికాట్ పండు ప్రయోజనాలు
ఆప్రికాట్.. రేగు పండు చెట్టు మాదిరిగా ఉండే చెట్టుకు కాసే ఈ పండును కొన్నిచోట్ల సీమబాదం అని పిలుస్తారు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాలో ఈ పండుకోసం ప్రత్యేకమైన రోజునే ఏర్పాటు చేసుకున్నారు. జనవరి 9వ తేదీని జాతీయ అప్రికాట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఆప్రికాట్ పండులోని ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. దీనివల్ల చర్మానికి, కంటికి, గుండెకు మంచి మేలు కలుగుతుంది. విటమిన్ ఏ, సి, ఫైబర్, ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇందులోని ఫైబర్ వల్ల పేగుల కదలికలు ఆరోగ్యంగా ఉంటాయి. దానివల్ల ఆహారం జీర్ణక్రియలో ఇబ్బంది కలుగదు. మలబద్దకం దూరం అవుతుంది.
ఆప్రికాట్ వల్ల కలిగే మరిన్ని లాభాలు
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక పండులో 17కేలరీలు, 4గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందువల్ల దీన్ని చక్కెర వ్యాధిగ్రస్తులు తమ డైట్ లో చేర్చుకోవచ్చు. ఫైబర్ ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కంటిచూపును మెరుగుపరుస్తుంది: 100గ్రాముల అప్రికాట్ పండులో 6శాతం పొటాషియం, 12శాతం విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఏ కారణంగా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా ఇందులోని ఫైబర్ వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దానివల్ల గుండె రక్త నాళాల్లో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. దానివల్ల చర్మం తేమగా ఉంటుంది. దురద రావడం, చర్మం పొడిబారిపోవడం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.