ఆండీస్ పర్వతాల్లో కొత్తగా కనుగొన్న పాముజాతికి హాలీవుడ్ నటుడి పేరు
పెరూ దేశంలోని ఆడీస్ పర్వతాల్లో కనుగొన్న కొత్తరకం పాము జాతికి హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ నటుడు హారిసన్ ఫోర్డ్ పేరును పెట్టారు. పర్యావరణ సంరక్షణ విషయంలో హారిసన్ ఫోర్డ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ రకం పాము జాతులను టాకిమెనాయిడ్స్ హారిసన్ ఫోర్డి(Tachymenoides harrisonfordi) అనే పేరును పెట్టారు. 16అంగుళాల పొడవున్న ఈ పామును ఒటిషి జాతీయ పార్కులో చిత్తడి నేలలో 2022లో పరిశోధకులు కనిపెట్టారు. ఈ పాము, పసుపు, గోధుమ రంగు మిశ్రమంలో ఉండి, నల్లని మచ్చలను కలిగి ఉంది. ఇంకా పొట్టభాగం నల్లగా ఉంది. రాగి రంగు కన్నుపై చిన్నగీత ఉంది. ఈ పామును కనిపెట్టేందుకు జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలు పనిచేసారు.
చీమకు, సాలీడుకు కూడా హారిసన్ ఫోర్డ్ పేరు
కొత్తరకం పాము జాతికి తన పేరు పెట్టడంపై స్పందించిన 81ఏళ్ల హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్, పరిశోధకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఇంకా, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయని, మనిషనే వాడు కేవలం చిన్నవాడేననీ హారిసన్ ఫోర్డ్ అన్నారు. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే గ్రూపు వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న హారిసన్ ఫోర్డ్ పేరును ఒక కొత్త జాతి చీమకు, సాలె పురుగుకు కూడా పెట్టారు. 1993లో పరిశోధకులు కనిపెట్టిన కొత్త రకం సాలీడు జాతికి కాల్పోనియా హారిసన్ ఫోర్డి (Calponia harrisonfordi) అనే పేరును పెట్టారు. అలాగే కొత్తరకం చీమ జాతికి ఫీడోల్ హారిసన్ ఫోర్డి (Pheidole harrisonfordi) అనే పేరును పెట్టారు.