అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి
ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో దాదాపుగా 6వేలకు పైగా భాషలున్నాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఉండాలని బంగ్లాదేశ్ సూచించడంతో 1999లో యునెస్కో ఆమోదించింది. అప్పటి నుండి ప్రతీ ఏడాది మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నారు. మన భారతదేశంలోనే లెక్కలేనన్ని భాషలున్నాయి. కాకపోతే 22భాషలను రాజ్యాంగం గుర్తించింది. వాటిల్లో కశ్మీరీ, కొంకణి, మణిపురి, నేపాలీ, పంజాబీ, సంస్కృతం, సింధి, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, తెలుగు, కన్నడ, మళయాలం, తమిళం, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ, ఒరియా, మరాఠీ, ఉర్దూ ఉన్నాయి. పదివేలకు పైగా జనాభా మాట్లాడే 121భాషలు భారతదేశంలో ఉన్నాయి. అంతేకాదు, ఈ భాషల్లోని యాసలు 19,500రకాలున్నాయి.
పిల్లలకు మాతృభాషలో విద్యను ఎందుకు అందించాలంటే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2023 థీమ్: "వివిధ భాషల్లో విద్య - విద్యను మార్చాల్సిన అవసరం" అనే థీమ్ తో ఈ సంవత్సరం మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీని ప్రకారం మాతృభాషలో పిల్లలకు విద్యను బోధించాల్సిన అవసరం ఉందని యునెస్కో పేర్కొంది. మాతృభాషలో విద్య నేర్చుకోవడం వల్ల, సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందనీ యునెస్కో చెబుతోంది. అందుకే విద్యను కేవలం ఒక భాషకే పరిమితం చేయకుండా, తాము మాట్లాడే భాషల్లో నేర్పించాలనీ, అప్పుడే పిల్లాడికి సులభంగా ఉంటుందనీ, పై తరగతులకు వచ్చేవరకూ అలాగే చేసి ఆ తర్వాత ఇతర భాషలకు పిల్లాడికి పరిచయం చేయాలనీ, చేయాలనీ,అలాంటప్పుడే పిల్లలకు ప్రపంచం అర్థమవుతుందనీ, లేదంటే చదువుకున్న విషయాలకు చూస్తున్న ప్రపంచానికి సంబంధం ఉండదని అంటున్నారు.