పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్
ఫిబ్రవరి నెలలో మూడవ గురువారాన్ని ప్రపంచ కొలాంజియోకార్సినోమా డే గా జరుపుకుంటారు. అంటే పిత్త వాహిక క్యాన్సర్ దినోత్సవం అన్నమాట. ఈ రకమైన క్యాన్సర్ చాలా అరుదు. ఈ క్యాన్సర్ ని తొందరగా గుర్తిస్తే దీని బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొలాంజియోకార్సినోమా విశేషాలు తెలుసుకుందాం. కాలేయం నుండి చిన్నపేగుకు వెళ్ళే పిత్త వాహికలో వచ్చే క్యాన్సర్ నే పిత్త వాహిక క్యాన్సర్ అంటారు. ఈ రకమైన క్యానర్ వచ్చినపుడు బతికి బట్టకట్టడం కష్టమవుతుంది. ఈ క్యాన్సర్ లో 0-4వరకు దశలు ఉంటాయి. జీరో దశలో గుర్తిస్తే దీన్నుండి తొందరగా బయటపడవచ్చు. పిత్తవాహకంలో పెరిగిన కణతి పరిమాణాన్ని బట్టి ఏ దశలో ఉందో నిర్ణయిస్తారు.
కొలాంజియోకార్సినోమా లక్షణాలు, ట్రీట్ మెంట్
జీరో దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. పిత్తవాహికలో కణతి పెరుగుతున్న కొద్దీ లక్షణాలు కూడా పెరుగుతాయి. కొన్నిసార్లు పచ్చకామెర్లు, చర్మం దురద పెట్టడం, అలసట, జ్వరం, కడూపునొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం లక్షణాలుగా కనిపిస్తాయి. పిత్తవాహిక క్యాన్సర్ రావడానికి కారణాలు: ఖచ్చితమైన కారణమంటూ ఏదీ లేదు, వయసు పెరుగుతున్న వారిలో ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా, కాలేయ వ్యాధులైన సిర్రోసిస్, హిపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటివి పిత్త వాహిక క్యాన్సర్ కు రావడానికి కారణంగా నిలిచే అవకాశం ఉంది. ట్రీట్ మెంట్: తొందరగా గుర్తిస్తే సర్జరీతో ఈ క్యాన్సర్ ని జయించవచ్చు. కొన్నిసార్లు కీమోథెరపీ, రేడియో థెరపీ వంటివి పనిచేస్తాయి. ఈ క్యాన్సర్ మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.