International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే..
అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 30న నిర్వహిస్తున్నారు. బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ స్మృతిగా ప్రతీ సంవత్సరం అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో అనువాదం అతి ముఖ్యమైంది. అన్ని దేశాలతో పరస్పరం భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో అనువాదం పాత్ర కీలకం. ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో భాషని వినియోగిస్తుంటారు. ఆయా భాషలను మాతృభాషల్లోకి అనువదించినప్పుడే, సదరు విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. ఈ నేపథ్యంలోనే అనువాదం(TRANSLATION) ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఏటా అనువాదం కోసం ప్రత్యేక రోజంటూ ఏదీ లేదని, ఈ మేరకు స్పెషల్ డేను కేటాయించాలని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్) 1953లో ప్రతిపాదనలు చేసింది.
ఫలితంగా మే 24, 2017న అంతర్జాతీయ దినోత్సవంగా ఆమోదం
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ సంస్థ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్స్ అండ్ ఇంటర్‌ప్రెటర్స్, రెడ్ టి, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్స్ తో పాటు క్రిటికల్ లింక్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇంటర్‌ప్రెటర్స్ లాంటి సంస్థలు సదరు తీర్మానాన్ని ఆమోదించాలని సూచించాయి. మరోవైపు 11 దేశాలు అజర్‌బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారీకా, క్యూబా, ఈక్వడార్, పరాగ్వే, ఖతార్, టర్కీ, తుర్క్‌మెనిస్తాన్, వియత్నాం 'డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఏ/71/ఎల్ 68'కు అనుకూలంగా సంతకాలు చేశాయి. ఫలితంగా మే 24, 2017న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(UNGN)లో సెప్టెంబరు 30ని అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా గుర్తించింది. అప్పట్నుంచి ఈరోజును అనువాద దినంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.