IPS Salary: ఐపీఎస్ అధికారుల నెల జీతం ఎంతో తెలుసా..?
మన దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాల్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఒకటి. కఠినమైన యూపీఎస్సీ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన వారే IPSగా ఎంపికవుతారు. ఏటా లక్షల మంది సివిల్ సర్వీసుల కోసం పరీక్ష రాస్తుండగా, అందులో కొద్దిమందే విజయం సాధిస్తారు. ఈ పరిస్థితిని చూస్తే ఈ ఉద్యోగం ఎంత ప్రతిష్ఠాత్మకమో అర్థం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీరి ప్రతిభకు అనుగుణంగా జీతభత్యాలు, అలవెన్సులు అందిస్తుంది. దేశంలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో IPS అధికారులది కీలక పాత్ర. ఇప్పుడు వీరి శాలరీ, అలవెన్సుల గురించి వివరంగా తెలుసుకుందాం.
అధికారుల ర్యాంక్, పోజిషన్ స్థాయికి అనుగుణంగా పే స్కేల్
సెంట్రల్ పే కమిషన్ రూపొందించిన మెట్రిక్స్ ప్రకారం IPS అధికారుల జీతాలు నిర్ణయించబడతాయి. ఆయా అధికారుల ర్యాంక్, పోజిషన్ స్థాయికి అనుగుణంగా పే స్కేల్ మారుతుంది. IPS అధికారులకు ఎంట్రీ లెవెల్ జీతం నెలకు రూ.56,100గా ఉంటుంది, ఇది డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్ హోదాల్లో పనిచేసే వారికి వర్తిస్తుంది. ర్యాంక్ పెరిగిన కొద్దీ జీతం పెరుగుతుంది. IPS అధికారుల జీతంలో బేసిక్ పే, గ్రేడ్ పే కీలక భాగాలు. గ్రేడ్ పే వారి ర్యాంక్ ఆధారంగా నిర్ణయించబడుతుంది, ఇది కూడా ఓవరాల్ శాలరీలో భాగంగా వుంటుంది.
సర్వీస్ పీరియడ్ పెరిగిన కొద్దీ స్కేల్
ప్రస్తుతం 2016లో అమలు చేసిన 7వ పే కమిషన్ ప్రకారం IPS అధికారులకు జీతభత్యాలు అందుతున్నాయి. 7వ పే కమిషన్ ఒక కొత్త పే మాట్రిక్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది, దీని ప్రకారం IPS అధికారుల జీతాలు నాలుగు స్కేల్ స్థాయుల్లో అందుతాయి. ఇవి జూనియర్, సీనియర్, సూపర్ టైమ్, ఎబోవ్ సూపర్ టైమ్ స్కేల్‌గా విభజించబడ్డాయి. ఆఫీసర్ సర్వీస్ పీరియడ్ పెరిగిన కొద్దీ స్కేల్ పెరుగుతుంది, దీనితో జీతభత్యాల్లో కూడా మార్పు ఉంటుంది. బేసిక్ పే, గ్రేడ్ పేతో పాటు IPS అధికారులకు అనేక రకాల అలవెన్సులు, ప్రయోజనాలు అందుతాయి.
కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్
ఆఫీసర్ల అవసరాలకు, వారి సామాజిక స్థాయిని మెయింటైన్ చేసుకోవడానికి వీటిని అందిస్తారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA) అందుతుంది, దీని విలువ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) మార్పుల ఆధారంగా ఉంటుంది. అదనంగా, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) కూడా ఉంటుంది, మెట్రోపాలిటన్ సిటీలు, ప్రధాన నగరాల్లో నియమితులైన వారికి HRA ఎక్కువగా ఉంటుంది. అధికారిక పర్యటనల ఖర్చుల కోసం ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటుంది. IPS అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు మెడికల్ కవరేజ్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి.