
Diwali 2025: దీపావళి కేవలం హిందువులకే పరిమితం కాదు.. మిగతా మతాల్లోని దీపావళి ఆచారాలు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి, పటాసులు పేలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ. అందులో మిఠాయిలు పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకునే పండుగ. ఈ పండుగకు పురాణకథలు, చారిత్రక నేపథ్యం ఉంది.దీపావళి కేవలం హిందువులకే పరిమితం కాదు, ఇతర మతాలవాళ్లూ దీన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సత్యభామతో కూడిన కృష్ణుడు నరకాసురుడనే రాక్షసుడ్నిచంపడంతో ప్రజలు ఆనందంలో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని చెబుతారు. అంతేకాక,రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజూ దీపావళి అని అంటారు. కానీ దీపావళికి ఇంకా విభిన్న ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, అనేక మతాల వాళ్లూ ఈ పండుగను జరుపుకుంటారు.
వివరాలు
నేపాల్ లో "తిహార్" పేరిట ఆరు రోజులపాటు దీపావళి
ఎందుకంటే.. దీపావళికి వాళ్లకు ముడిపడిన చారిత్రక సంఘటనలు,సందర్భాలు ఉన్నాయి. బౌద్ధులు: సాధారణంగా బౌద్ధుల పండుగ కాకపోయినా, వజ్రయాన శాఖలోని బౌద్ధులు దీన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా నేపాల్‌లోని నేవార్ బౌద్ధులు దీపావళిని "తిహార్" పేరిట ఆరు రోజులపాటు జరుపుతారు.వారు లక్ష్మీదేవిని పూజించి, ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. పరిశోధకుల అభిప్రాయంలో, నేవార్ బౌద్ధులు హిందువుల లాగా లక్ష్మీదేవి, విష్ణువును ఆరాధిస్తూ దీపావళి వేడుకను నిర్వహిస్తారు. జైనులు: జైనులు వాళ్ల గురువు మహావీరుడు నిర్యాణం పొందిన రోజున దీపావళి జరుపుకుంటారు. వారు వెలిగించే దీపాల కాంతిని మహావీరునికి అంకితంగా భావిస్తారు. జైన సంప్రదాయం ప్రకారం, 18 రాజులు మహావీరుని చివరి బోధనలను సేకరించి, దీపాల కాంతిలో భద్రపరిచారు.
వివరాలు
దీపావళి రోజున హరగోవింద్, 52 మంది సిక్కులు గ్వాలియర్ జైలు నుండి విడుదల
అందుకే జైనులు దీపావళిని అతని జ్ఞాపకంగా, బోధనలను గుర్తుచేసుకునే రోజుగా చేసుకుంటారని చెప్తారు. వ్యాపారస్తులు ఈ రోజు నుండి కొత్త లెక్కలతో వ్యాపారం ప్రారంభిస్తారు. సిక్కులు: సిక్కులకు దీపావళి ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. మూడవ గురువు అమర్ దాస్ గుర్తుగా దీపావళి పండుగను చేస్తారు. గోయిద్వాల్‌లో 84 మెట్ల బావి నిర్మించి, ఆ పవిత్ర జలంతో శుద్ధి చేసుకోవడం ద్వారా దీపావళి ఆచారంగా మారింది. ఈ పండుగను జరుపుకోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి: దీపావళి రోజున హరగోవింద్, 52 మంది సిక్కులు గ్వాలియర్ జైలు నుండి విడుదలయ్యారు. 1577లో అమృతసర్ స్వర్ణదేవాలయంలో శంఖుస్థాపన జరిగింది.1738లో భాయ్ మణిసింగ్,దీపావళి జరుపుకునేందుకు జరిమానా చెల్లించలేక. మతం మార్చుకునేందుకు ఇష్టపడక బలిదానం అయ్యాడు.
వివరాలు
ఆర్యసమాజం:
సంఘసంస్కర్త దయానంద సరస్వతి హిందూ మూఢనమ్మకాలు, బాల్యవివాహం వంటి దురాచారాలను తొలగించడానికి 1875లో ఆర్యసమాజాన్ని స్థాపించారు. అతని బోధనలు నచ్చి చాలామంది ఆరోజుల్లో ఆయనను అనుసరించారు. 1883లో ఆయన దీపావళి రోజున దివంగతమయ్యారు. అందువల్ల ఆర్యసమాజాన్ని అనుసరించే వారు దీపావళిని ప్రత్యేకమైన రోజు గా జరుపుతారు.