Effects of Lack of Sleep: నిద్రలేమీతో బరువు పెరుగుదలకు కారణం? మీకు తెలియని నిజాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
నిద్రలేమి బరువు పెరుగుదలకు కీలక కారకమన్న విషయం చాలా మందికి తెలియదు. కొందరు రోజూ వ్యాయామం చేస్తూ, కఠినమైన డైట్‌ను పాటిస్తూనే ఉన్నా ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి తగిన నిద్ర లేకపోవడమే. నేటి బిజీ జీవనశైలిలో చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగింది. ఎక్కువ ఆహారం తీసుకుంటేనే బరువు పెరుగుతారని అనుకోవడం తప్పుడు భావన; సరైన నిద్ర లేకపోయినా శరీరంలో కొవ్వు నిల్వయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డైట్‌ను క్రమంగా పాటిస్తూ వ్యాయామం చేస్తూనే ఉన్నా నాణ్యమైన నిద్ర లభించకపోతే శరీరం కొవ్వును సమర్థవంతంగా కరిగించలేదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Details
7-8 గంటలు నిద్ర అవసరం
ఒకే విధమైన డైట్‌ను అనుసరించినవారిలో, తక్కువ నిద్రపోయినవారు-ఎక్కువ నిద్రపోయిన వారితో పోలిస్తే-సుమారు 55% తక్కువ కొవ్వును కోల్పోయారని పరిశోధనలు చెబుతున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమి కొనసాగితే శరీరంలోని సర్కేడియన్ రిథమ్ దెబ్బతిని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆకలిని పెంచే 'ఘ్రెలిన్' హార్మోన్ స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ అధికమవడంతో శరీరం కొవ్వును కరిగించకుండా నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ మార్పులన్నీ చివరకు బరువు పెరుగుదలకు, ఊబకాయానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, బరువు తగ్గడంలో మెరుగైన ఫలితాలను పొందాలంటే రోజుకు కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరిగా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాలుంటే తప్పనిసరిగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.