Healthy Lifestyle Tips: డైట్ కాదు, జీవనశైలి ముఖ్యం.. ఆరోగ్యకరంగా, ఆనందంగా నూరేళ్లు జీవించాలంటే ఇలా ఉండండి!
ఈ వార్తాకథనం ఏంటి
పండగలైనా, పుట్టినరోజులైనా, లేదా ప్రత్యేక సందర్భాలైనా పెద్దలు మనకు తరచూ "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదిస్తారు. దీని అర్థం నూరేళ్ల ఆయుష్షుతో ఆనందంగా జీవించాలి అని. కానీ, అంతకాలం జీవించాలంటే కేవలం అదృష్టం సరిపోదు. ముఖ్యంగా ఆరోగ్యం, జీవనశైలి చాలా ముఖ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటే, అలసట లేకుండా, చింతలు లేకుండా జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. కాబట్టి ఆరోగ్యం కోసం ప్రార్థించడం మాత్రమే కాక, చిన్న చిన్న సూత్రాలు, అలవాట్లను పాటించడం కూడా అవసరం. ఆరోగ్యంతో పాటు జీవన నాణ్యత (Quality of Life) కూడా అత్యంత ముఖ్యమైనది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా, నూరేళ్ల వరకు హాయిగా జీవిస్తారు.
Details
సంప్రదాయ వంటకాలను సమయానికే తినాలి
శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ ప్రాంతాల ఆహారం, జీవనశైలి, రహస్యాలను గమనించి అధ్యయనం చేస్తున్నారు. వారి పరిశోధనలు సూచిస్తున్నవి. ఆరోగ్యం ప్రత్యేకంగా సాధించాల్సిన లక్ష్యం కాదు, అది మంచి జీవనశైలికి సహజ ఫలితం అని. ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవించే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను 'బ్లూ జోన్స్' అంటారు. ఉదాహరణకు జపాన్ - ఓకినావా, ఇటలీ-సార్డీనియా, గ్రీస్ - ఇకారియా, కోస్టారికా - నికోయా. ఇక్కడ నివసించే ప్రజలు ఆరోగ్యంపై కాక, జీవన నాణ్యతపై దృష్టి పెట్టి జీవిస్తున్నారు. వారు కేవలం స్థానికంగా లభించే ఆహారం, సంప్రదాయ వంటకాలను సమయానికి తినడం అలవాటు చేసుకుంటారు. వీరి ముఖ్య అలవాటు కడుపు 80% నింపి ఆహారం ఆపడం. జపాన్‌లో దీనిని హర హాచిబు అంటారు.
Details
కుటుంబ సభ్యులతో కలిసి తినాలి
ఇది జీర్ణక్రియ, ఆరోగ్యం కోసం చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే నెమ్మదిగా తినడం, చిన్న ప్లేట్లలో భోజనం, కుటుంబ సభ్యులతో కలిసి తినడం వీరి సాధారణ అలవాట్లలో ఉన్నాయి. బలమైన బంధాలు కూడా వీరి ఆరోగ్య రహస్యాల్లో ఒక భాగం. కుటుంబం, స్నేహితులు, పరిచయ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉండటం, ఒత్తిడి లేదా నిరాశ వచ్చినప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. బ్లూ జోన్స్ ప్రజలు వృద్ధాప్యంలో కూడా ఖాళీగా కూర్చోవడం కరపించరు. రిటైర్ అయినా కుటుంబానికి సహాయం చేస్తారు, కూరగాయలు పండించడం, వంట, మనవళ్లను చూసుకోవడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నత శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
Details
రాత్రిపూట తక్కువగా తినాలి
ఆహార విషయాన్నీ పరిశీలిస్తే, వారు మితంగా, పోషకాహారంతో జీవిస్తారు. కూరగాయలు, పప్పులు, సోయా, బాదం, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు ఎక్కువగా తీసుకుంటారు. మాంసాహారం వారానికి ఒకటి-రెండు సార్లు మాత్రమే, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. ఉదయం పూట పుష్కలమైన భోజనం తీసుకుని, రాత్రి తక్కువగా తినడం వారి ప్రత్యేకత. వృద్ధులు కూడా రోజూ నడక, చిన్న పనులు చేస్తూ చురుకుగా ఉంటారు. ఏ పని చేసినా దానికి ప్రయోజనం ఉందని చూసుకుంటారు. ముఖ్యంగా ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి లేని జీవనశైలి అంటే సగం జబ్బులు లేనట్టే. ఇలాంటి అలవాట్లను మనం కూడా అనుసరిస్తే ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్యం పొందడం కష్టమైన పని కాదని చెప్పొచ్చు.