Valentino Garavani: ఇటాలియన్ ఫ్యాషన్ ఐకాన్ వాలెంటినో కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్, ప్రపంచానికి 'వాలెంటినో' బ్రాండ్ ను పరిచయం చేసిన వాలెంటినో గరవాని (93) మరణించారు. సోమవారం రోమ్‌లోని తన నివాసంలో ఆయన శాంతంగా కన్నుమూశారని ఆయన ఫౌండేషన్ అధికారికంగా తెలిపింది. వయోభారంతోనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. వాలెంటినో తన కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూశారని 'ఫొండాజియోన్ వాలెంటినో గరవాని ఇ జియాన్కార్లో గియామెట్టి' ఒక ప్రకటనలో ప్రకటించింది. ఈ వార్తపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "వాలెంటినో స్టైల్, అందానికి తిరుగులేని మాస్టర్. ఇటాలియన్ హై ఫ్యాషన్ కు శాశ్వత చిహ్నం. ఇటలీ ఒక లెజెండ్ ను కోల్పోయింది" అని ఆమె నివాళులర్పించారు.
వివరాలు
'వాలెంటినో రెడ్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిజైనర్
1932లో జన్మించిన వాలెంటినో, 1960లో తన భాగస్వామి జియాన్‌కార్లో గియామెట్టితో కలిసి రోమ్‌లో ఫ్యాషన్ హౌస్ ను స్థాపించారు. దాదాపు 50 ఏళ్ల పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలిన ఆయన 2008లో రిటైర్ అయ్యారు. ఆయన సృష్టించిన ప్రత్యేక ఎరుపు రంగు 'వాలెంటినో రెడ్'గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జాక్వెలిన్ కెన్నెడీ, ప్రిన్సెస్ డయానా వంటి అంతర్జాతీయ ప్రముఖులకు ఆయన డిజైన్లు అందించారు. వాలెంటినో అంత్యక్రియలు జనవరి 23న రోమ్‌లో జరుగనున్నాయి. జనవరి 21, 22 తేదీల్లో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫౌండేషన్ కార్యాలయంలో ఉంచుతారు.