అక్షయ తృతీయ 2023: ఈరోజున కొనాల్సిన వస్తువులేంటో తెలుసుకోండి
వైశాఖ మాసంలో వచ్చే మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ అంటే నాశనం లేనిదని అర్థం. అందుకే ఈరోజు ఏది కొనుక్కున్నా దానికి నాశనం ఉండదని, పెరుగుతూనే ఉంటుందని నమ్మకం. అక్షయ తృతీయ అనగానే అందరికీ బంగారమే గుర్తొస్తుంది. ప్రతీ ఒక్కరూ బంగారం కొనేందుకు ఎగబడతారు. అయితే మీకిది తెలుసా? బంగారం కాకుండా అక్షయ తృతీయ రోజున చాలా వస్తువులు కొనవచ్చు. అవేంటో చూద్దాం. వెండి: బంగారం కొనడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఎలా నమ్ముతారో వెండి కొనడం వల్ల కూడా అదృష్టం వస్తుందని నమ్ముతారు. వెండి పాత్రలు, వెండి నాణేలు కొనవచ్చు. చాలామంది తమ ప్రియమైన వారి కోసం వెండి వస్తువులు కొంటుంటారు.
భూమి మీద పెట్టుబడి
రియల్ ఎస్టేట్: ఫ్లాట్లు, ప్లాట్లు కొనడానికి ఈరోజు ఇంట్రెస్ట్ చూపిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు మంచి గిరాకీ ఉంటుందని చెప్పుకుంటారు. స్టాక్స్: షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. ఈరోజు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా లాభాలు తీసుకువస్తుందని నమ్మకంతో ఉంటారు. వాహనాలు: కారు, బైక్ కొనడానికి ఈరోజు మంచి రోజని నమ్ముతారు. ఈరోజు వాహనం కొనడం వల్ల ప్రయానాలు సురక్షితంగా సాగుతాయని నమ్మకం. బట్టలు: సాధారణంగా ఈరోజు ఎక్కువగా సాంప్రదాయ దుస్తులు కొంటారు. కొత్త బట్టల వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.
పుస్తకాలతో జ్ఞానం వస్తుందని నమ్మకం
వ్యవసాయ పనిముట్లు: వ్యవసాయ దారులు పనిముట్లను కొనేందుకు ఇష్టం చూపిస్తారు. కలుపు తీసే చిన్న వాహనాలు, నాట్లు వేసే పరికరాలు, పొలం దున్నే వాహనాలు కొంటారు. ఈరోజు కొనడం వల్ల పనిముట్లు ఎక్కువ కాలం మన్నుతాయని నమ్ముతారు. పుస్తకాలు: అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనాలంటే ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే పొరపాటే. ఈరోజు పుస్తకాలు కూడా కొనవచ్చు. పుస్తకాల మీద డబ్బులు పెట్టడం వల్ల వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుందని నమ్మకం. అలాగే జ్ఞానం వస్తుందని భావిస్తారు. విరాళం: అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి విరాళం అందిస్తే పుణ్యం దక్కుతుందని చెబుతారు. డబ్బు, బట్టలు, ఆహారం, ఇలా ఏదైనా విరాళంగా ఇవ్వవచ్చు.