Vijayawada: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక ఉత్సాహంతో పులకించారు.
తల్లిని ఉపాసనతో భక్తుల కష్టాలు, బాధలు తొలగిపోతాయి
దుర్గముడనే రాక్షసుడిని సంహరించిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్యుని ప్రభలతో వెలిగే ఈ దేవత, తన భక్తులను సర్వదుర్గతుల నుంచి రక్షిస్తుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి అని పూజిస్తున్నారు. ఈ తల్లిని ఉపాసన చేయడం ద్వారా భక్తుల కష్టాలు, బాధలు తొలగిపోతాయి. గ్రహదోషాలు తొలగుతాయి. అమ్మవారికి ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలతో, అక్షతలతో పూజ చేస్తారు. పులగం ప్రసాదంగా నివేదించి, "ఓం దుం దుర్గాయై నమః" అనే మంత్రాన్ని జపించడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం పొందవచ్చు. అలాగే, దుర్గాసూక్తం, లలిత అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలను పారాయణ చేస్తే మంచిదని భావిస్తారు. వేద పండితులను ఈ రోజున సత్కరిస్తే అమ్మవారు మరింత సంతోషిస్తారని అంటారు.