Karthika Masam: కార్తీక మాసం.. హరిహరులకు ప్రీతికరమైన పవిత్ర కాలం.. ఈ నెల రోజులు ఏం చేయాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి వేడుకలతో ఆనందంగా గడిపిన తర్వాత, ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక మాసం మొదలవుతుంది. తెలుగు పంచాంగ ప్రకారం సంవత్సరంలోని అన్ని మాసాల్లో కార్తికం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన ఈ మాసం భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే మార్గంగా చెప్పబడింది. కానీ ఈ కార్తిక మాసానికి అంతటి మహిమ ఎందుకు దక్కింది? దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
వివరాలు
కార్తికం అనే పేరుకి మూలం
శరదృతువులో వచ్చే ఈ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. అందుకే ఈ మాసానికి "కార్తిక మాసం" అనే పేరు వచ్చింది. తెలుగు పంచాంగంలో ఇది తొమ్మిదవ మాసం. అన్ని మాసాల్లోకెల్లా శ్రేష్ఠమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. కార్తికానికి సమానమైన మాసం లేదు స్కంద పురాణం ప్రకారం, కార్తిక మాసానికి సమానమైన మాసం లేనట్లే, శ్రీ మహా విష్ణువుకు సమానమైన దేవుడు, గంగకు సమానమైన తీర్థం, వేదాలకంటే శ్రేష్ఠమైన శాస్త్రం లేదని పేర్కొనబడింది.
వివరాలు
హరిహరులకు ప్రీతికరం
హిందూ సంప్రదాయం ప్రకారం సంవత్సరం రెండు అయనములుగా విభజించబడుతుంది. ఉత్తరాయణం,దక్షిణాయనం. ఉత్తరాయణంలో మాఘ మాసం ఎంత ప్రాధాన్యం కలిగిందో, దక్షిణాయనంలో కార్తిక మాసానికి అంతే విశిష్టత ఉంది. ఈ మాసం హరిహరులకు (శివుడు, విష్ణువు) అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణం ప్రకారం, ఈ మాసంలో శివారాధన చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. నదీస్నానం కార్తిక మాసంలో నదీ స్నానం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఋషులు, మహర్షులు ఈ నెలంతా పవిత్ర నదీ తీరాల్లో నివసిస్తూ ప్రతిదినం స్నానాన్ని ఆచరిస్తారు. గంగా, యమునా, గోదావరి, కావేరి, కృష్ణ వంటి పవిత్ర నదుల్లోనే కాకుండా చెరువులు, సరస్సులు, సముద్ర జలాల్లో స్నానం చేసినా పుణ్యం కలుగుతుందని స్కంద పురాణంలోని కార్తీక పురాణం పేర్కొంటుంది.
వివరాలు
దీపారాధన
కార్తిక మాసంలో దీపాలు వెలిగించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శివాలయాలలో దీపారాధన చేస్తే పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే తెలిసి కానీ తెలియక కానీ, ఏ కారణం చేతైనా దీపం వెలిగించినా, ఆ ఫలం అపారమని గ్రంథాలు పేర్కొంటాయి. భక్తి, శ్రద్ధలతో చేసిన దీపారాధన భక్తుని జీవితంలో దివ్య ఫలితాలను తీసుకొస్తుంది.
వివరాలు
దానధర్మాలు
సంపాదనకు విలువ దానంతోనే వస్తుందని స్కంద పురాణం వివరిస్తుంది. కార్తిక మాసంలో చేసిన దానాలు సాధారణ కాలంలో చేసిన దానాల కంటే కోటిరెట్లు ఎక్కువ పుణ్యఫలం ఇస్తాయి. ఈ మాసంలో దీపదానం, సాలగ్రామదానం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం వంటి దానాలు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తరిస్తాయని, గతించిన పూర్వీకులకు సద్గతులు కలుగుతాయని కార్తిక పురాణం చెబుతోంది. పురాణ పఠనం కార్తిక మాసంలోని 30 రోజులపాటు ప్రతి రోజు కార్తిక పురాణంలోని ఒక్కో అధ్యాయం విన్నా, చదివినా లేదా రాసినా కలిగే పుణ్యం అశేషం.
వివరాలు
ఉపవాసం
ఈ మాసంలో భక్తులు నక్తం పేరుతో ఉపవాసాలు ఆచరిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా దైవస్మరణలో నిమగ్నమై, సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయడం నక్తం అని అంటారు. ఇలా ఉపవాసం చేయడం వలన దైవానుగ్రహం లభిస్తుందని, ఆరోగ్య పరంగా కూడా ఇది శాస్త్రీయంగా ప్రయోజనకరమని పండితులు పేర్కొంటున్నారు. కార్తిక సోమవారాల విశిష్టత ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివారాధనకు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
వివరాలు
భూలోక వైకుంఠం
ఈ నెలలో ఒక వైపు "హర హర శంకర" అంటూ శివాలయాలు ఘోషలతో మారుమ్రోగుతుంటే, మరోవైపు విష్ణు భక్తులు శ్రీ సత్యనారాయణ వ్రతాలు, ఏకాదశి ఉపవాసాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తూ వైకుంఠాన్ని భూలోకంలోనే అనుభవిస్తారు. ఈ మాసం భక్తులకు మోక్షదాయకం. భక్తి, నియమ నిష్టలతో దీపారాధన, ఉపవాసాలు, దానాలు, నదీస్నానాలు చేస్తూ హరిహరులను ఆరాధిస్తే, ఈ జన్మలో సుఖసంపదలు పొందడమే కాకుండా జన్మరాహిత్యం కూడా లభిస్తుందని సూత మహాముని కార్తిక పురాణంలో వివరించారు.