Kuntala Waterfall: కొండల మధ్య జారిపడే కుంతల జలపాతం.. హైదరాబాద్ నుంచి దూరం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
చుట్టూ దట్టమైన అడవులు,కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం. పక్షుల కిలకిలారావాలు, ప్రకృతితో నిండిన ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది. ఈ అందాల కారణంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చాలామంది "తెలంగాణ కాశ్మీర్" అని ప్రేమగా పిలుస్తారు. ఊటీ,కొడైకెనాల్ లాంటి హిల్ స్టేషన్లను గుర్తు తెప్పించే ల్యాండ్‌స్కేప్స్ ఇక్కడ కనిపిస్తాయని పర్యాటకులు చెబుతుంటారు. ముఖ్యంగా "తెలంగాణ నయాగారా"గా ప్రసిద్ధి గాంచిన కుంతల జలపాతాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి సందర్శకులు వస్తూనే ఉంటారు. మరి ఈ అద్భుతమైన కుంతల జలపాతం హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉంది? చుట్టుపక్కల ఎలాంటి ప్రదేశాలు చూడదగ్గవిగా ఉంటాయి? ఇవన్నీ చూద్దాం.
వివరాలు
కుంతల జలపాతం ప్రత్యేకతలు
కున్తల జలపాతం, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేరడిగొండ మండలం.. కుంతల (బి) గ్రామం సమీపంలోని అడవి ప్రాంతంలో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు ఒక్కసారిగా కిందికి జారిపడుతున్న అద్భుత దృశ్యం సృష్టిస్తుంది. జలపాతాన్ని దగ్గరగా ఆస్వాదించాలంటే దాదాపు 430 మెట్లు దిగాలి.. అదే ప్రయాణంలో మరో చిన్న అడ్వెంచర్ ఫీలింగ్. సహ్యాద్రి శ్రేణుల మధ్య వంగివంగి వెళ్లే మహబూబ్ ఘాట్ సహజ సోయగాలు ప్రకృతి ప్రియులను మంత్రుముగ్ధులను చేస్తాయి. హైదరాబాద్ నుంచి కుంటాల జలపాతం దూరం సుమారు 250 కిలోమీటర్లు.
వివరాలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర పర్యాటక ఆకర్షణలు
ఉమ్మడి ఆదిలాబాద్ అంటే కేవలం కుంతల జలపాతం మాత్రమే కాదు..ఇదంతా ప్రకృతి,సంస్కృతి, చరిత్రల కలయిక. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఈ ప్రాంత గౌరవం. గోదావరి,ప్రాణహిత నదులు ఇక్కడ తమ మహోన్నత ప్రవాహంతో ఆకర్షణీయదృశ్యాలు సృష్టిస్తాయి. కడెం ప్రాజెక్టు పచ్చని కొండలు,ప్రశాంత జలాలతో పర్యాటకులను రప్పించే మరో అందమైన ప్రదేశం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి. దట్టమైన అడవులతో ఆ ప్రాంతం సహజసిద్ధంగా ఆలనాపాలన చేస్తూ పక్షులు, వన్యప్రాణులకు ఆశ్రయంగా ఉంది. అలాగే జైపూర్ మండల శివారులో ఉన్న మొసళ్ల సంరక్షణకేంద్రం కూడా ఆదిలాబాద్ పర్యటనలో తప్పక చూడాల్సిన ప్రదేశాల జాబితాలో ఉంటుంది.