Tirumala Laddu History: తిరుపతి లడ్డూకి ఘనమైన చరిత్ర.. లడ్డూకి 308 ఏళ్లు పూర్తి
కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టపడేది శ్రీవారి లడ్డూ ప్రసాదం. భక్తులు తప్పక తమ కుటుంబ సభ్యుల కోసం ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళతారు. శ్రీనివాసుడికి ఉన్న విశిష్టత లాగానే తిరుమల లడ్డూకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలు స్వామి వారి ప్రసాదంగా 309 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. 1715 ఆగస్టు 2న మొదటిసారి ఈ లడ్డూను ప్రసాదంగా భక్తులకు అందించారు. తిరుమల వెంకన్నను భక్తులు తమ కోరికలు తీర్చే దేవుడిగా,కష్టాలు తొలగించే దివ్య పురుషుడిగా ఆరాధిస్తారు. అందుకే ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల ఆలయాన్ని దర్శించుకుంటారు. వారు స్వామి వారి దర్శనం అనంతరం,శ్రీవారి ప్రసాదమైన లడ్డూను సంతోషంగా తీసుకెళ్తారు.
శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకు గొప్ప చరిత్ర
ఈ ప్రసాదాన్ని ఇంటిలో పూజ చేసి, ఆత్మీయులకు పంచుతుంటారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం మొదలైన కాలం నుంచి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకు గొప్ప చరిత్ర ఉంది. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి వెన్నతో ప్రారంభించి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు వంటి అనేక నైవేద్యాలను సమర్పిస్తారు. తిరుమల అంటే మనకు వెంటనే లడ్డూ గుర్తుకు వస్తుంది. టీటీడీలో అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ, భక్తులలో లడ్డూ ప్రసాదం ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రసాదాల్లో శ్రీవారి లడ్డూ ప్రముఖంగా నిలిచింది.లడ్డూను ప్రసాదంగా ఇవ్వడం 1715 ఆగస్టు 2న ప్రారంభించారని చెబుతారు.కానీ ఈ తేదీకి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.
ఎన్నో మార్పుల అనంతరం లడ్డూ ప్రసాదం
2010 వరకు, టీటీడీ రోజుకు లక్షల లడ్డూలను తయారు చేసేది. భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, ప్రస్తుతం రోజుకు సుమారు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కలిగి ఉండటం ఒక విశేషం. 2014లో లడ్డూ భౌగోళిక గుర్తింపు (Geographical Indication) పొందింది. శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదం దాదాపు 309 సంవత్సరాల కిందట ప్రారంభమైనదని తెలుస్తోంది. 1715 ఆగస్టు 2న ఈ లడ్డూ ప్రసాదం తయారు అయ్యినట్లు చెబుతారు. మొదట క్రీ.శ.1803లో బూందీ రూపంలో పరిచయమైన ఈ ప్రసాదం, 1940 నాటికి లడ్డూ రూపంలో మారి శాశ్వతంగా స్థిరపడినట్లు పండితులు అభిప్రాయపడుతున్నారు.
మొదట్లో 8 నాణేలకే అమ్మకం!
లడ్డూ ప్రసాదం తొలుత ఎనిమిది నాణేల ధరకు ఇచ్చేవారని, క్రమంగా ధర 2, 5, 10, 15, 25 రూపాయలుగా పెరిగి, ప్రస్తుతం 50 రూపాయలకు టిటిడి విక్రయిస్తోంది. 1940 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, లడ్డూ ప్రసాదం 83 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని కొందరు పేర్కొంటున్నారు. లడ్డూకు పేటెంట్, ట్రేడ్‌మార్క్ కలిగి ఉండటం ఒక విశేషం. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల చరిత్రకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింతగా పెరిగినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి.