రెండు పుస్తకాలు రాసిన నాలుగేళ్ళ పిల్లాడు: గిన్నిస్ రికార్డులో చోటు
ప్రపంచ రికార్డులు సృష్టించడం తేలికైన విషయం కాదు. నాలుగేళ్ళ వయసులో ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుతం ప్రపంచమంతా నాలుగేళ్ళ పిల్లాడి గురించి మాట్లాడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సయీద్ రషీద్ ఆల్మెరీ అనే నాలుగేళ్ల పిల్లాడు రెండు పుస్తకాలు రాసి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. తన మొదటి పుస్తకాన్ని 4సంవత్సరాల 218రోజుల వయసులో పూర్తి చేసాడు. అలాగే మొదటి పుస్తకానికి సీక్వెల్ గా రెండవ పుస్తకాన్ని 4సంవత్సరాల 238రోజుల వయసులో కంప్లీట్ చేసాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత చిన్నవయసులో పుస్తకాలు రాసిన రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అక్క స్ఫూర్తితో పుస్తకం రాసిన సయీద్
ద ఎలిఫెంట్ సయీద్ అండ్ ద బేర్ అనే టైటిల్ తో మొదటి పుస్తకాన్ని రాసాడు సయీద్. ఈ పుస్తకంలో, అడవుల్లో ఉండే ఏనుగు పర్వతాల మీదకు వెళ్లాలనుకుంటుంది. అక్కడ ధృవపు ఎలుగుబంటితో స్నేహం కుదురుతుంది. మొదటి పుస్తకానికి సీక్వెల్ గా మై ట్రూ ఫ్రెండ్ అనే టైటిల్ తో రెండవ పుస్తకాన్ని సయీద్ ప్రచురించాడు. ఈ పుస్తకంలో, పర్వతాల నుండి ఏనుగు అడవుల్లోకి వెళ్తుంది. అప్పుడు ధృవపు ఎలుగుబంటి ఏ విధంగా సాయం చేసిందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఈ రెండు పుస్తకాలు రాయడానికి తన అక్క అల్దాబి అల్మేరీయే కారణం. అత్యంత చిన్న వయసులో(8సంవత్సరాల 239రోజులు) రెండు భాషల్లో(ఇంగ్లీష్, అరబిక్) పుస్తకాన్ని రాసి అల్దాబి అల్మేరీ ప్రపంచ రికార్డు సృష్టించింది.