Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ
పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు. కానీ సంక్రాంతి వేళ వచ్చే 'పొంగళ్లు' అందుకు విరుద్ధంగా, చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ వేడుకలో ఆడవాళ్ల ఊసే ఉండదు.. పూజల దగ్గర నుంచి వంటలు వండటం, తినడం వరకు మొత్తం మగవాళ్లే చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ వేడకను ఎక్కడ జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. కడప జిల్లా, పుల్లంపేట మండలం, తిప్పాయపల్లె గ్రామంలో 'పొంగళ్లు' వేడుకను ప్రత్యేకంగా జరుపుకుంటారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం 'పొంగళ్లు' వేడుకను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. తిప్పాయపల్లె గ్రామ వాసులు ఇక్కడి ఆంజనేయ స్వామిని 'శ్రీ సంజీవరాయ స్వామి'గా కొలుస్తారు.
ఆ రోజు ఊరిలోని మగళ్లంతా గుడిలోనే
సంజీవరాయ స్వామి వారికి ఆలయంలో 'పొంగళ్లు' వేడుకల నేపథ్యంలో పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఎక్కడయినా ఆడవాళ్లు నైవేద్యం పెట్టి మొక్కును తీర్చుకుంటారు. కానీ ఈ గుడిలో మాత్రం మగవాళ్లే పొంగలిని నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లిస్తారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఉదయం నుంచే ఊర్లోని మగళ్లంతా ఆలయానికి చేరకుంటారు. స్వయంగా మగవాళ్లే స్వామి వారికి నైవేధ్యాన్ని వండుతారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ తర్వాత నైవేధ్యాన్ని సమర్పిస్తారు. అలాగే 101 జల బిందెలతో స్వామివారిని అభిషేకిస్తారు. గుడిలో వండిన నైవేధ్యాన్ని.. ఆడవాళ్లు అస్సలు ముట్టుకోరు. ఇది కేవలం మగవారు మాత్రమే తినాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల స్వామివారు తమ కోర్కెలు తీరుస్తారని గ్రామ ప్రజల విశ్వాసం.