Loading...
Microsoft outage: మైక్రోసాఫ్ట్‌ సర్వీసుల్లో అంతరాయం.. జర్మనీలో 15 మందికి అస్వస్థత
మైక్రోసాఫ్ట్‌ సర్వీసుల్లో అంతరాయం.. జర్మనీలో 15 మందికి అస్వస్థత

Microsoft outage: మైక్రోసాఫ్ట్‌ సర్వీసుల్లో అంతరాయం.. జర్మనీలో 15 మందికి అస్వస్థత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా జర్మనీలోని ఓ రిసార్ట్‌లో 15 మంది పర్యాటకులు విషవాయువు బారిన పడ్డారు. కీలకమైన హెచ్చరిక ఈమెయిల్‌ సకాలంలో చేరకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు జర్మన్ మీడియా సంస్థ WDR వెల్లడించింది. బ్రూల్‌ (Brühl)లోని ఫాంటసియాలాండ్ థీమ్ పార్క్, రిసార్ట్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ వాయువు లీకైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ డోసింగ్ వ్యవస్థ అవసరానికి మించి క్లోరిన్‌ను నీటిలోకి పంపించింది. దీంతో పూల్‌లో క్లోరిన్ స్థాయి ప్రమాదకరంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత సిబ్బందికి వెంటనే సమాచారం అందించేందుకు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కారణంగా హెచ్చరిక ఈమెయిల్‌ వారికి చేరలేదు. దీంతో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేకపోయారు.

వివరాలు 

అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ

ఆ సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న 15 మంది శ్వాస సంబంధిత సమస్యలు, శ్వాసనాళాల్లో మంటతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వీరిలో నలుగురిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత తీవ్రంగా ఉందని, మరికొంతకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది.

మొత్తం 40 మంది అత్యవసర సేవల సిబ్బందిని రిసార్ట్‌కు పంపించి సహాయక చర్యలు చేపట్టారు.

వివరాలు 

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం

గత వారం మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసింది.

ఔట్‌లుక్, ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్‌తో పాటు ఆఫీస్ యాప్‌లు కూడా పనిచేయలేదు.

ఆస్ట్రేలియా, జపాన్‌లో తొలుత ఈ సమస్యలు బయటపడ్డాయి.

అక్కడి ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర సేవల విభాగాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనాపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

ADVERTISEMENT

వివరాలు 

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం

ఈ అంతరాయానికి సైబర్ దాడి కారణమన్న వార్తలను మైక్రోసాఫ్ట్ ఖండించింది.

గత జులైలో మైక్రోసాఫ్ట్ 365 నెట్‌వర్క్ గేట్‌వే సర్వర్లలో చేసిన మార్పులకు సంబంధించిన పాత లోపమే తాజా సమస్యకు కారణమని వివరించింది.

కొన్ని పరిస్థితుల్లో సర్వర్లపై ఒత్తిడి పెరిగినప్పుడు అవి పనిచేయకుండా నిలిచిపోయాయని తెలిపింది.

నెట్‌వర్క్‌పై ట్రాఫిక్ పెరగడంతో సర్వర్ల సామర్థ్యం 14 శాతం తగ్గిపోయింది. దీంతో పనిచేస్తున్న సర్వర్లపై వినియోగదారుల భారం ఒక్కసారిగా పెరిగింది.

ఫలితంగా అవి కూడా అదే సాంకేతిక సమస్యకు గురయ్యాయి. చివరకు నెట్‌వర్క్‌లో 80 శాతానికి పైగా వ్యవస్థలు పనిచేయకుండా నిలిచిపోయాయని మైక్రోసాఫ్ట్ వివరించింది.

ADVERTISEMENT