
ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే
ఈ వార్తాకథనం ఏంటి
మన మనసు చాలా అల్లరి చేస్తుంటుంది. దానికి ఊహలెక్కువ. ఆశలెక్కువ. ఆకాశంలో ఎగరాలని చూస్తుంది, దారం లేకపోయినా. నీళ్ళలో తడవాలని చూస్తుంది, ఈత రాకపోయినా.
అందుకే దాన్ని మనం కట్టడి చేయాలి. లేదంటే మనసు చేసే అల్లరిని తట్టుకోలేరు. ఇక్కడో ఉదాహరణ చెబుతాను, మీకు షుగర్ ఉంది. కానీ స్వీట్లంటే మీకు చాలా ఇష్టం.
మీ మనసు చెబుతుంది కదా అని తెగ తిన్నారనుకో, కొన్ని రోజుల్లో హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. అందుకే మనసును నియంత్రణలో ఉంచుకుంటే హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం రాదు.
కానీ ఇలా ఎవ్వరూ ఆలోచించరు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సుఖపడతావ్ అని చెప్పి మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్లాలనుకుంటారు. కొన్నిసార్లు అసాధ్యమైన పనులను కూడా చేయాలనుకుంటారు.
ప్రేరణ
మనసు మీద ఫోకస్ పెడితే జీవితాన్ని మర్చిపోతారు
కళ్ళకు కనిపించిన ప్రతీదాన్ని మనసు కోరుకుంటూనే ఉంటుంది. తెల్లారి లేవగానే ఎక్సర్ సైజ్ చేయాల్సింది పోయి, లేచి రీల్స్ చూడమని చెబుతుంది. మీరలానే చూసారనుకోండి.
మీ టైమ్ వృధా ఐపోతుంది. అసలు మీరు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయాలను మర్చిపోతారు. మనసును తొందరగా సంతృప్తి పరిచే విషయాల మీదే మీ ఫోకస్ ఉండిపోతుంది.
మీకు అవసరమయ్యే వాటి మీద దృష్టి పెట్టలేరు. ఫలితంగా సామాన్యుడిలా ఉండిపోతారు. ఎదుగుదల ఉండదు. ఈ పరిస్థితి ఎదురైనపుడే అవతలి వారిని చూసి కుళ్ళుకుంటారు.
అవతలి వారు సక్సెస్ అయినట్టు మీరు కాలేకపోవడానికి కారణం, మనసు కోరిన ప్రతీదీ మీరు చేయడమే అని మీకు తెలీనే తెలీదు. ఏదో బ్రతుకుతారు అంతే.