ప్రేరణ: నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా?
ఈ భూమ్మీద ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు బాగా డబ్బుతో పుడతారు. కొందరు కటిక పేదరికంలో పుడతారు. ఎవరి జీవితం వారిది. డబ్బున్న వాళ్ళకు కష్టాలు ఉంటాయి. పేదలకూ కష్టాలుంటాయి. అయితే ఈ ఇద్దరినీ హ్యాపీగా ఉంచేది మాత్రం ఒక్కటే. అదే పోల్చుకోకపోవడం. నువ్వెప్పుడైతే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం మొదలెడతావో అప్పుడే నీకు దుఃఖం దగ్గరవుతుంది. నీకెన్ని డబ్బులున్నా, ఎన్ని విజయాలున్నా పోల్చుకోవడం అనే లోపం నీలో ఉంటే నీకు సుఖం ఉండదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు సుఖంగా ఉండాలంటే ఇతరులతో పోల్చుకోకూడదు. ముందే చెప్పినట్టు, ఏ ఒక్కరు కూడా మరొకరిలా ఉండరు.
స్ఫూర్తి వేరు, ఈర్ష్య వేరు
ఇతరులతో పోల్చుకుని వాళ్ళలా సంపాదించాలనో లేక సాధించాలనో అనుకుంటే మంచిదే. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటారు. అలా కాకుండా అవతలి వాళ్ళకు నాకు తేడా ఏంటి? అవతలి వాళ్ళను దాటేయాలంటే ఏం చేయాలని నువ్వు ఆలోచించావనుకో అప్పుడే నీకు కష్టాలు ఎదురవుతాయి. ఇలా పోల్చుకున్నప్పుడు అవతలి వాళ్ళు నీకన్నా తక్కువ స్థాయిలో ఉంటే నీ అహం సంతృప్తి చెందుతుంది. ఎక్కువ స్థాయిలో ఉంటే నీలో ఈర్ష్య పుడుతుంది. నీలో ఉన్న ప్లస్సులను కూడా మర్చిపోయేలా చేసి నీ ఆనందాన్ని మింగేస్తుంది. ఆనందంగా ఉండడానికి ఒకటే మంత్రం. అదే పోలిక లేకపోవడం. స్ఫూర్తిగా తీసుకో తప్పులేదు. ఈర్ష్యగా భావిస్తేనే నీ భవిష్యత్తు అంధకారమవుతుంది.