ప్రేరణ: ఎవరెస్టు అంత కృషి చేసి అనుకున్నది సాధించినపుడు ఆ ఆనందం ఆకాశమంత ఉంటుంది
మీరొక ఎగ్జామ్ రాసారు. ఆ ఎగ్జామ్ కు సంబంధించిన సబ్జెక్టు మీరసలు కొంచెం కూడా చదవలేదు. అయినా కూడా మీకు 90మార్కులు వచ్చాయి. ఇంకో ఉదాహరణ చూద్దాం. మీకు నచ్చిన సబ్జెక్టుని ఎంతో ఇష్టపడి, రాత్రీ పగలూ తేడా లేకుండా చదివారు. ఆ ఎగ్జామ్ లో మీకు వందకు 99మార్కులు వచ్చాయి. పై రెండు సంఘటనల్లో మిమ్మల్ని అత్యంత ఆనందంగా ఉంచేది ఏది? రెండవ ఉదాహరణే. ఎందుకంటే, అక్కడ మీరు మార్కుల కోసం కృషి చేసారు. మీరనుకున్న ఫలితం వచ్చింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు. అదే మొదటి ఉదాహరణలో మీకు పెద్దగా సంతోషం కలగదు.. ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో పాటు మీలో అనేక అనుమానాలు కలుగుతాయి.
ప్రలోభాలకు లొంగితే ఆనందం దూరం
ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, కృషి ఎంత ఎక్కువగా చేస్తే, దాని పాజిటివ్ ఫలితం వల్ల అంత ఆనందం వస్తుందీ అని. అందుకే కృషి చేయడంలో వెనుకంజ ఏయకండి. అలా వేసినట్టయితే మీరు మీ ఆనందాన్ని తగ్గించేసుకున్నట్టే. మీకు జీవితంలో ఆనందం కావాలంటే ఒక పని కోసం పరిశ్రమించండి. ఆనందం అనగానే చాలామంది ప్రలోభాలను గుర్తు తెచ్చుకుంటారు. ప్రలోభావల వల్ల తాత్కాలిక ఆనందం మాత్రమే దొరుకుతుంది. శాశ్వతానందం కావాలంటే ప్రలోభాలకు దూరంగా ఉండి పనిచేయడం ప్రారంభించాలి. మీరెంత ఎక్కువ పనిచేస్తే మీకంత ఆనందం వస్తుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఎన్ని రోజుల టైమ్ పడుతుందో, అన్ని రోజుల కృషికి సరిపడా ఆనందం ఎక్కిన తర్వాత లభిస్తుంది.