ప్రేరణ: అన్నీ తెలుసనుకునే వాళ్ళు ఇతరుల మాట వినరు, అదొక్కటే వాళ్ళ కొంప ముంచుతుంది
ఈ వార్తాకథనం ఏంటి
మనుషులు రకరకాలుగా ఉంటారు. అందులో అన్నీ తమకే తెలుసనుకునేవారు కూడా ఉంటారు. వీరితో చాలా ప్రాబ్లమ్. ఎందుకంటే వీళ్ళసలు అవతలి వాళ్ళ మాటలు వినరు.
అంతా తమకే తెలుసనీ, ఎవ్వరికీ ఏమీ తెలియదనీ, అసలు ఇంత చిన్న విషయం కూడా జనాలకు ఎందుకు తెలియట్లేదనీ జనాల మీద జాలి పడుతుంటారు.
అంతేకాదు, వీరు సలహాలు ఎక్కువగా ఇస్తారు. విచిత్రం ఏమిటంటే, వీళ్ళకు అసలు టచ్ లేని విషయంలో కూడా వీళ్ళు తెగ మాట్లాడేస్తారు. సలహాలిస్తారు. తిక్కలేస్తే ఎద్దు కూడా పాలిస్తుందని చెబుతారు.
మీరు నమ్మకపోతే నమ్మించడానికి ప్రయత్నం చేయరు, మీ తెలివి ఇంతే అనుకుని మీ మీద జాలి చూపిస్తారు. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే వెంటనే ఆలోచనలను మార్చుకోండి.
ప్రేరణ
కాలం కొత్తగా వెళ్తున్నప్పుడు పాతవాటిని మార్చేయాలి
అన్నీ తెలుసనుకుని ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోని వారు, కాలానుగుణంగా అప్డేట్ కాలేరు. ప్రస్తుత ప్రపంచంలో రోజుకో కొత్త రకంగా లోకం మారుతోంది. ఈ టైమ్ లో అన్నీ తెలుసని ముడుచుకుని కూర్చుంటే మళ్ళీ లేవలేరు.
ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలన్న కోరికతోనే ఉంటేనే రేపు భవిష్యత్ ఉంటుంది. చాలామంది సీనియర్స్, ఒక వయసు రాగానే తమ రంగంలోని పాత పద్దతులనే తమ పనుల్లో అనుసరిస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళ పనుల్లో కొత్తదనం లేక జనాలను ఆకర్షించవు. ఇదే విషయం జీవితానికీ వర్తిస్తుంది. అనుభవం గొప్పదే కానీ రోజువారి జీవితం అంతకన్నా గొప్పది.
తెలియని దాన్ని తెలుసుకుంటూ, తెలియని వాళ్లకు నేర్పుకుంటూ, చెప్పిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడే అవకాశాలు తగ్గిపోకుండా ఉంటాయి.