ప్రేరణ: ఆనందం అతిధిగా మారితే జీవితం కష్టాల్లో ఉందని అర్థం
ఆనందం కోసం వెతుకుతూ కూర్చుంటే ఎంతో విలువైన క్షణాలను అనుభవించడం మిస్సవుతారన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. దానికి కారణం ఏంటంటే, ఆనందం అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించే అతిథి అని అందరూ అనుకుంటారు. మీరలా అనుకోకండి. ఎందుకంటే ఆనందం అనేది అతిథి కాదు. మీ జీవితంలో ఆనందం అతిధిగా మారిందనుకోండి. మీరు జీవితాన్ని జీవించడానికి చాలా కష్టపడుతున్నారని అర్థం. చేస్తున్న పని ఇష్టం లేనపుడు ఆ పని చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు మీ జీవితంలో ఆనందం ఉండదు. ఇలాంటి వారి జీవితాల్లో, వారంలో వచ్చే వీకెండ్ లాగా ఆనందం కూడా ఎప్పుడో ఒకసారి వచ్చిపోతూ ఉంటుంది. ఒక్కోసారి వీకెండ్ లో ఎక్స్ ట్రా వర్క్ లాగా ఆనందం అనేది లేకుండా పోతుంది.
చేస్తున్న పని నచ్చకపోతే ఆనందం దూరమవుతుంది
ఆనందం దూరమవడానికి ముఖ్య కారణం, చేస్తున్న పని నచ్చకపోవడం, లేదా నచ్చిన పని చేయకపోవడం. ఈ రెండింట్లో మీరు ఏ క్యాటగిరీలోకి వస్తారో చెక్ చేసుకోండి. చేస్తున్న పని నచ్చకపోతే, నచ్చిన పని చేయడం మొదలెట్టండి. అప్పుడు పనిచేస్తున్నంత సేపూ మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉన్నారంటే అతిధిలా ఉన్న ఆనందం, దాని స్థానాన్ని మార్చేసుకుని మీలోకి చేరిపోయిందన్న మాట. ఇప్పుడు మీరూ, ఆనందం ఒక్కటైపోయారు. ఇక మిమ్మల్నెవరూ ఓడించలేరు. మీ నుండి ఆనందాన్ని ఎవ్వరూ తీసేయలేరు. కానీ కాలగమనంలో మార్పుల వల్ల ఒకప్పుడు నచ్చిన పని, ఇప్పుడు నచ్చకుండా పోతుంది. అందుకే కాలానుగుణంగా మారుతూ మీకు ఆనందాన్నిచే పనులు చేసుకుంటూ వెళ్ళండి.