ప్రేరణ: నువ్వున్న ప్లేస్ లో ఆనందం లేకపోతే, అది బంగారు భవంతి అయినా బయటకు వచ్చెయ్
నీకెన్ని బంగ్లాలున్నా, కార్లున్నా, గాల్లో ఎగిరే విమానాలున్నా మనసులో కొంచెం ఆనందం లేకపోతే అవన్నీ ఉన్నా లేనట్టే లెక్క. మనిషిగా ఏం సంపాదించాలనే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరికి డబ్బు సంపాదించాలనుంటుంది. ఇంకొందరు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటారు. ఇంకొందరు పెళ్ళి చేసుకుని బతికేద్దాం అనుకుంటారు. ఎవరు ఏది అనుకున్నా దాని అంతిమ లక్ష్యం ఆనందమే. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఆనందమొస్తుంది కాబట్టే సంపాదిస్తారు. నువ్వు సంపాదించిన డబ్బు, నీకు ఆనందం ఇవ్వనపుడు నువ్వు సంపాదించినదంతా వృధానే. నువ్వు చేరుకున్న గమ్యం నీకు ఆనందాన్ని ఇవ్వట్లేదంటే అక్కడి నుండి మరో గమ్యం వైపు బయలు దేరడమే మంచిది.
జీవితంతో రాజీపడితే ఆనందం దూరమవుతుంది
నువ్వు చేస్తున్న పనిలో నీకు ఆనందం లభించకపోతే నువ్వు చేస్తున్న పని ప్రభావవంతంగా ఉండదు. ఆ కారణంగా నువ్వు పని మానేయాల్సి రావచ్చు. అప్పుడు నీ మనసు ఇంకా బాధపడుతుంది. అందుకే పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఎంత వెదికినా దొరక్కపోతే ఆనందాన్నిచ్చే పనిని వెతకాలి. అంతేకానీ రాజీపడిపోయి ఈ జీవితానికింతే అనుకున్నావంటే నువ్వక్కడికే ఆగిపోతావ్. జీవితమనే ప్రయాణంలో కొత్త అందాలు నీకు కనిపించవు. అందుకే ఆనందమే అల్టిమేట్ అని గుర్తుంచుకోండి. అది లేనపుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. అలాంటప్పుడు బ్రతుకన్న దానికే అర్థం లేకుండా పోతుంది. మీరు ఈ భూమ్మీద పుట్టిందే ఆనందం కోసమన్న సంగతి అర్థం చేసుకుంటే, ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి