Page Loader
ప్రేరణ: అందమైన అబద్ధం జీవితాన్ని అందంగా మార్చలేదు
ఊహా ప్రపంచం నిజ ప్రపంచం గొప్పది

ప్రేరణ: అందమైన అబద్ధం జీవితాన్ని అందంగా మార్చలేదు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 09, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అబద్ధం.. ఇది చాలా అందంగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు రావనుకునే అబద్ధం ఎంతో హాయినిస్తుంది. ప్రపంచంలోని ధనమంతా రేపు తెల్లారేసరికి నీ కాళ్ళముందుకు వచ్చేస్తుందనే అబద్ధపు నమ్మకం నిన్ను ఉత్సాహంగా ఉంచుతుంది. అష్టవంకర్లున్న నీకు, ఐశ్వర్యారాయ్ ని తలదన్నే అందగత్తె భార్యగా వస్తుందని ఎవరైనా చెబితే అది అబద్ధమైనా ఓ క్షణం మనసుకు తృప్తి కలుగుతుంది. అందుకే అబద్ధం అందంగా ఉంటుందనేది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అబద్ధం అందంగా ఉంటుందే తప్ప అది జీవితాన్ని అందంగా మార్చలేదని. ఇది తెలుసుకున్నప్పుడే నువ్వు వాస్తవ ప్రపంచంలోకి వస్తావు. లేదంటే అబద్ధం చూపించే ఊహా ప్రపంచంలోనే బ్రతుకుతూ జీవితంలో సుఖం పొందకుండా ఉండిపోతావ్.

ఆనందం

అబద్ధాన్ని నమ్మడం మానేసినపుడు అంతులేని ఆనందం మీ సొంతమవుతుంది

ఇక్కడ అబద్ధం అంటే ఊహ అని చెప్పుకోవచ్చు. ఊహల్లో బ్రతికేవారు ఆ క్షణాలు మాత్రమే ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత వాస్తవం వాళ్ల మీద పంజా విసురుతుంది. దాని ధాటికి వాళ్ళు తట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళు గెలవలేరు. వాస్తవ ప్రపంచంతో పోరాడేవాడే విజయం సాధిస్తాడు. ఏది జరిగినా ధైర్యంగా ముందుకు వెళ్లేవాడే విజేతగా నిల్చుని ఆదర్శంగా నిలుస్తాడు. అబద్ధపు ప్రపంచంలో బ్రతికేవాడు ఊహాల్లోనే విజయం పొందేసి, అక్కడే రిటైర్ అయిపోతాడు. వాళ్ళకెప్పుడూ విజయం దక్కదు. అసలు అదెలా ఉంటుందో కూడా వాళ్లకు తెలియదు. అందుకే అబద్ధపు ప్రపంచమైన ఊహను విడిచి నిజ ప్రపంచంలోకి అడుగు పెట్టండి. కష్టాలెదురైనా విజయం మాత్రం లభిస్తుంది. ఆ విజయమే నిజమైనదని గుర్తుంచుకోండి.