ప్రేరణ: జీవితం నువ్వనుకున్నట్టు ఉండదని తెలుసుకుంటే నీకు జీవితంలో బాధ తక్కువగా ఉంటుంది
జీవితం అనేది పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో బాధ నిండిన ఛాప్టర్లు ఉంటాయి. అలాగే సంతోషం నిండిన ఛాప్టర్లు ఉంటాయి. బాధ నిండిన ఛాప్టర్ల దగ్గర చదవడం ఆపేస్తే పుస్తకం వల్ల ఆనందం లభించదు. జీవితం కూడా అంతే. బాధలు వస్తుంటాయి. కష్టాలు వస్తుంటాయి. అవి వచ్చినపుడు ఛీ ఈ జీవితం ఎందుకు అని ఆలోచించకూడదు. సంతోషం వచ్చినప్పుడు ఎవ్వరూ జీవితం మీద కంప్లైంట్ చేయరు. దుఃఖం వచ్చినపుడే ఈ బ్రతుకు ఎందుకు అనుకుంటారు. ఇలా అనుకోవడానికి ముఖ్య కారణం, జీవితం మీద సరైన అవగాహన లేకపోవడమే. జీవితం అనేది రోలర్ కోస్టర్ లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. హ్యాపీగా ఉన్నామనుకునే లోపే ఏదో ఒక విషాదం ఇబ్బంది పెడుతుంది.
జీవితంలో దుఃఖం కూడా భాగమే
జీవితంలో దుఃఖం కూడా ఒక భాగమని నీకు తెలిసినపుడు, దుఃఖం నీ దగ్గరకు వచ్చినా నువ్వు ఎక్కువగా బాధపడకుండా ఉంటావు. నీ జీవిత ప్రయానం నువ్వనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు. చాలాసార్లు నువ్వొకటి అనుకుంటే జీవితంలో మరోటి అవుతుంది. ఎంత ప్లాన్ చేసుకున్నా నువ్వు అనుకున్నట్టుగా జీవితం సాగదు. జీవితంలో కష్టాలుంటాయి.. నిజమే, కానీ ప్రతీసారీ కష్టాలు, బాధల గురించే ఆలోచిస్తే సంతోషం అనేది లేకుండా పోతుంది. బాధలు వచ్చినపుడు వాటిని ఎలా దాటాలని నువ్వు ఆలోచిస్తే నీ జీవితం అంత ముందుకు వెళ్తుంది. అలా కాకుండా బాధల్లోనే మునిగిపోతే ఇంచుకూడా ముందుకు కదలకుండా బాధల చట్రంలో ఇరుక్కుపోతుంది. అప్పుడు నీ నుండి అందరూ దూరమవుతారు.