Page Loader
ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు
మనసును బాధలతో నింపకండి

ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 31, 2023
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొందరుంటారు. తమకు ఎదురైన ప్రతీ అనుభవాన్ని డైరీలో నోట్ చేసుకుంటారు. ఒకరోజులో మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. అందులో కొన్ని అత్యంత ముఖ్యమైనవి ఉంటాయి. మరికొన్ని అంత ప్రాముఖ్యం లేనివి ఉంటాయి. ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకోకుండా ప్రతీ అనుభవాన్ని మనసులో భద్రపరుస్తూ పోతే నీ మనసు ఒక చెత్తబుట్టలా తయారవుతుంది. ఎందుకంటే ఏ మనిషికి కూడా అన్నీ ఆనందకర అనుభవాలే ఎదురు కావు. ప్రతీ ఒక్కరికీ చేదు అనుభవాలు కలుగుతుంటాయి. ఆ చేదును ఎక్కువగా తలచుకుంటూ ఉన్నావనుకో, నీ జీవితంలో రుచి తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు అందరికీ శత్రువుగా మారతావు. అందుకే చేదును వదిలేసి కేవలం ఆనందాలను మాత్రమే మనసులో భద్రపర్చుకోండి.

జీవితం

పగ, ప్రతీకారాలను మీ మనసు డబ్బాలోంచి తీసేయండి

జీవితంలో మనకు చాలామంది ఎదురౌతారు. అందులో కొందరు మీకు కోపం తెప్పించవచ్చు. మిమ్మల్ని అవమానించవచ్చు. అలాంటి వాళ్ల జ్ఞాపకాలను మీ మనసులో ఉంచేసుకుని, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ల పని చేస్తాననుకుంటూ ఉన్నారనుకోండి. వాళ్లను ఏదో చేయడం అటుంచితే మీ ఆరోగ్యమే అటకెక్కిపోతుంది. మనసును వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోండి. మనసులో ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు పెట్టుకోకండి. అలాంటప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అవసరం లేనివన్నింటినీ డబ్బాలో దూర్చుతూ పోతే అవసరమున్న వాటిని తీయాలంటే కష్టమైపోతుంది. కాబట్టి మీ డైరీనీ పగ, ప్రతీకారాలతో నింపేయకండి మనసు బరువుగా మారుతుంది. దాని బదులు హ్యాపీనెస్ తో నింపితే తేలికైపోతుంది.