Page Loader
Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే !
Motivation: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే !

Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే !

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనకు ఏదైనా సాధించాలనిపిస్తే అది వెంటనే జరగాలని ఆశపడతాం. ఆ కోరిక తక్షణమే తీరాలని కోరుకుంటాం. అయితే, అది తక్షణంగా జరగకపోతే కోపం వస్తుంది."ఇది నన్ను చేతకాదేమో" అనే భావనతో వెనక్కి తగ్గిపోతాం. నేటి యువతలో చాలా మందికి ఇదే సమస్య. ఏదైనా ఆలోచించగానే వెంటనే ఫలితం రావాలని కోరుకుంటారు. అది సాధ్యపడకపోతే తీవ్ర ఆందోళనకు లోనవుతారు.విజయం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ ఓటమిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. గెలుపు వచ్చినప్పుడు అది తాము సాధించినదిగా చెప్పుకుంటారు. ఓటమి వస్తే మాత్రం తప్పును ఇతరులపై నెట్టడం సహజంగా మారిపోయింది. మనం చేసే ప్రతీ ప్రపోజల్‌ను అంతా ఆమోదించాలని భావిస్తాం. మన ఆలోచన గొప్పదేనని నమ్ముతాం.కానీ మనకంటే మెరుగ్గా ఆలోచించగలవారు ఉండొచ్చనే విషయాన్ని పట్టించుకోం.

వివరాలు 

సహనం కలిగిన వారు ముందుకు సాగుతారు

మనల్ని మనం విశ్వాసంతో చూసుకోవడం తప్పుకాదు. కానీ ఇతరులను తక్కువగా అంచనా వేయడమే చాలా మందిలోని పెద్ద లోపం. ముఖ్యంగా యువతలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. లక్ష్యాన్ని చేరుకోలేని ప్రధాన కారణం - ఓపిక లేకపోవడం. మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది ఎంతగా వేధించినా ఓపికతో సమాధానాలు చెబుతారు. మరికొందరు మాత్రం తక్షణమే ప్రతిస్పందిస్తారు. సహనం కలిగిన వారు ముందుకు సాగుతారు. సహనం లేనివారు మార్గమధ్యంలోనే ఆగిపోతారు. యువతలో ఓపిక కొరవడిపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. జీవితంలో విజయాన్ని చూసేందుకు ఓపిక తప్పనిసరి.

వివరాలు 

విజయం సాధించాలంటే కష్టపడాలి

ఒక విత్తనం నాటగానే మొక్కగా మారి పండ్లు ఇస్తుందా? కచ్చితంగా కాదు. మొదట అది మొలకెత్తాలి, పెరగాలి, అప్పుడు మాత్రమే పండ్లను ఇస్తుంది. ఇది జరిగేందుకు మనం దాన్ని కాపాడాలి. అలాగే మన లక్ష్యం కూడా విత్తనం లాంటిదే. అది తక్షణ ఫలితాలు ఇవ్వదు. తగిన శ్రద్ధ, పట్టుదలతో నడుస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. మన ప్రయత్నం ఎలా ఉందో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. మనం చేసే ప్రయత్నంలో లోపాలుంటే లక్ష్యంపై ఆశలు కోల్పోవల్సి వస్తుంది. విజయం సాధించాలంటే కష్టపడాలి. విజయం తేలికగా లభించేదైతే ఇప్పటికే అందరూ విజేతలే అయ్యేవాళ్లు. కొన్ని సందర్భాల్లో ఇతరులు సులభంగా విజయాన్ని సాధించినట్టు కనిపించొచ్చు. కానీ వారి వెనుక ఉన్న కృషిని మనం అంచనా వేయలేము.

వివరాలు 

తప్పును పునరావృతం చేయడమే అసలు సమస్య

విజయానికి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది. ఇందుకు ఓపిక, సహనం మాత్రమే అవసరం. ఈ రోజు మనం అనుకున్నది జరగకపోవచ్చు. కానీ దాంతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. బదులుగా, ఈ రోజు మనం చేసిన తప్పులను గమనించి వాటిని రేపు తిరిగి చెయ్యకుండా ఉంటే విజయం వైపు అడుగు పడ్తుంది. తప్పులు చేయడం తప్పుకాదు. కానీ అదే తప్పును పునరావృతం చేయడమే అసలు సమస్య. కొత్త తప్పులు మనకు కొత్త విషయాలు నేర్పిస్తాయి. దీని ద్వారా మనం విజయానికి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.

వివరాలు 

ఓపికగా ఉంటే విజేత

ఓపిక ఉంటే విజేతగా నిలబడటం ఖాయం. కొన్ని సందర్భాల్లో స్నేహితులు లేదా పెద్దవారు ఇచ్చే సలహాలను మనం పూర్తిగా వినకుండానే "నాకు తెలుసు" అంటూ మధ్యలోనే మాట్లాడడం మొదలుపెడతాం. ఇది మనలో వినే ఓపిక లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇతరులు చెప్పే విషయాలను అర్థం చేసుకునే ముందు మనం స్పందించడం వల్లనే లక్ష్యాన్ని చేరక ముందే ఆగిపోతాం. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఓపికతో, సహనంతో తమ లక్ష్యాన్ని చేధించేందుకు కృషి చేస్తే విజయం వారిని వెంబడించకుండా పోదు.