ప్రేరణ: ఉచిత సలహాలు ఇచ్చేవారికి దూరంగా ఉండకపోతే మీరు మీద నమ్మకం కోల్పోతారు
ఈ ప్రపంచంలో పక్కనవారి బాధ గురించి ఆలోచన ఎవ్వరికీ ఉండదు. కానీ పక్కన వాడికి సలహాలు ఇవ్వడానికి మాత్రం ప్రతీ ఒక్కరు పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు. సలాహాలు, ముఖ్యంగా ఉచిత సలహాలు ఇచ్చేవారి నుండి దూరంగా ఉండండి. వారు మీకేమీ తెలియదనీ, వారు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుందని మిమ్మల్ని నమ్మిస్తారు. ఫలితంగా మీకు మీ మీద నమ్మకం తగ్గిపోతుంది. జీవితంలో ఏ విషయం గురించైనా ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. మీకంటూ సొంత నిర్ణయం లేకుండా పోతుంది. నిర్ణయాలు తీసుకునే సత్తా పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఉచిత సలహాలు ఇచ్చేవారిని ముందుగానే పక్కన పెట్టేయడం మంచిది. లేదంటే మీకు మీరు దక్కకుండా పోతారు.
ప్రోత్సహించేలా ఉండని సలహా
ఉచిత సలహాలు ఇచ్చేవారు తమను తాము తెలివైనవారిగా, సలహాలు తీసుకునే వారిని అధములుగా చూసే అవకాశం ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా తాము సాధించలేని పనిని ఇతరులు సాధించాలని పూనుకుంటే అసూయతో ఉచిత సలహాలు ఇచ్చి ఆ పని మీ వల్ల కాదని చెప్పే అవకాశం ఉంది. నీవల్ల అలా చేయడం కాదు, వేరేలా చేయాలి, ఆ గేమ్ లో నువ్వు గెలవలేవు, దానికన్నా చిన్న గేమ్ లో ఆడితే బెటర్ లాంటి నెగెటివ్ దారిలోనే ఉచిత సలహాలు ఉంతాయి. నువ్వు కుంభస్థలం బద్దలు కొట్టగలవ్, నీలో ఆ దమ్ముంది అని ప్రోత్సహించేలా ఒక్క సలహా కూడా చెప్పరు. అందుకే ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళకు దూరంగా ఉండాలి.