ప్రేరణ: చిన్న పనులను పెద్దగా చూసినపుడే పెద్ద స్థానం అందుకోగలం
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న చిన్న పనులను చిన్నచూపు చూడకుండా ముందుకు సాగినపుడే పెద్ద విజయం మీ సొంతమవుతుంది. అవును, చిన్నది నీ జేబులోకి రాకముందు పెద్దదాన్ని నువ్వు అందుకోలేవు.
ఉదాహరణకు ఒకరు చదువు పూర్తయాక, చాలా చిన్న జాబ్ లో చేరారనుకుందాం. మరొకరేమో పెద్ద జాబ్ వచ్చేదాకా వెయిట్ చేసారు. మూడేళ్ళు గడిచిపోయింది.
చిన్నజాబ్ చేసిన వ్యక్తికి ప్రమోషన్ వచ్చి జీతం రెట్టింపయ్యింది. పెద్ద జాబ్ కోసం చూసే వాళ్ళేమో ఇంకా జాబ్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అలా ఐదేళ్ళు గడిచిపోయింది. పెద్ద జాబ్ రాలేదు.
కానీ చిన్న జాబ్ చేసే వ్యక్తి మాత్రం మరో ప్రమోషన్ తో పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే చిన్న మెట్లను చులకనగా చూడకూడదు. అవే నిన్ను పెద్దస్థాయికి తీసుకెళ్తాయి.
ప్రేరణ
చిన్న వాటివైపు కదులుతోన్న ప్రపంచం
చిన్నదంటే నీకంత అలుసెందుకు? ఆ అలుసే నీకుంటే నీవు చిన్నవాటి ముందు నలుసులా మారిపోవడం ఖాయం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రపంచమే చిన్న వాటివైపు కదులుతోంది.
ఇప్పుడు థియేటర్లలో వచ్చే పెద్ద సినిమాలకన్నా సెల్ ఫోన్ లో కనిపించే రీల్స్ కే డిమాండ్ ఎక్కువ. అందుకే చిన్న దాన్ని చిన్నగా చూడకూడదు.
చిన్న చిన్న నిచ్చెన మెట్లే ఆకాశం వరకు నిన్ను చేరుస్తాయని నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ మెట్లపై నువ్వున్నప్పుడు ఇంకో మెట్టు ఎలా ఎక్కాలని ఆలోచించు. ఆటోమేటిక్ గా నువ్వు పెద్దస్థాయికి వెళ్ళిపోతావ్.
చిన్న మెట్లను చిన్నగా చూసినవారు పెద్ద మెట్లు ఎక్కుదామని ఆలోచిస్తూ ఎప్పుడూ కిందే ఉండిపోతారు.