ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోగలనా లేదా అన్న అనుమానం రాకపోతే అది గొప్ప లక్ష్యం కాదన్నమాట
మీ జీవిత లక్ష్యం ఏమిటి? రోజూ దానికోసమే పనిచేస్తున్నారా? ఆ లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం మీలో ఉందా? ఒకవేళ మీరు నిజంగా చేరగలనని అనుకుంటే అది పెద్ద లక్ష్యం కాదన్నమాట. వినడానికి విచిత్రంగా ఉంది కదా. ప్రతీ ఒక్కరికీ తమ తమ సామర్థ్యాలు తెలుసు. ఒక పనిని నువ్వు ఖచ్చితంగా చేయగలవన్న నమ్మకం నీకున్నప్పుడు దాన్ని పెద్ద లక్ష్యంగా గుర్తించరు. నువ్వు సాధించగలవో లేదోనన్న అనుమానం నీకొచ్చినపుడే అది గొప్ప లక్ష్యం అవుతుంది. నీకున్న సామర్థ్యంతో ఒక పని చేయడం సులభమే. కానీ నువ్వు పెట్టుకున్న లక్ష్యం కోసం నీ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే గొప్ప లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. సులభమైన పని ఎవ్వరైనా చేస్తారు. కష్టమనుకున్న దాన్ని చేసినపుడే గొప్పదనం బయటకు కనిపిస్తుంది.
ఆలోచిస్తే సరిపోదు ఆచరించినపుడే గొప్పగా ఎదుగుతారు
లక్ష్యం ఎప్పుడైనా పెద్దగా ఉండాలి. దాన్ని అందుకునేందుకు గొప్పగా కృషి చేయాలి. లేదంటే సామాన్యులుగా మిగిలిపోతారు. సామాన్యుల లక్ష్యాలు చిన్నవిగా ఉంటాయి. వారు తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇష్టపడరు. గొప్పదాన్ని సాధించడం తమవల్ల కాదనుకుంటారు. కనీసం గొప్పవిషయాల గురించి ఆలోచించడం కూడా వృధానే అనుకుంటారు. అలా అని చెప్పి గొప్ప వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆలోచన మనసులో ఉండిపోతుంది. ఆచరణ ఒక్కటే లక్ష్యాన్ని మీ దగ్గరికి చేరుస్తుంది. గొప్పకళలు కనండి, గొప్పగా ఉండండి. వయసై పోయిందని, ఇప్పుడు నావల్ల కాదని అనుకోకండి. కే ఎఫ్ సీ యజమాని 60ఏళ్ల వయసులో దాన్ని స్టార్ట్ చేసాడని గుర్తుంచుకోండి.