ప్రేరణ: అసాధ్యమని పక్కన పడేసే ముందు అవుతుందేమోనని ఒకసారి ఆలోచించేవాళ్ళే ఈతరం విజేతలు
ఈ వార్తాకథనం ఏంటి
అసాధ్యం అన్న పదం ఇంకొన్ని రోజుల్లో డిక్షనరీలోంచి మాయమైపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత తరంలో సాధ్యం కానిదేది లేదన్నట్టుగా ప్రపంచం పరుగెడుతోంది.
ఒకప్పుడు అసాధ్యాలుగా కనిపించిన ఎన్నో విషయాలు నేడు సాధ్యాలుగా మిగిలాయి. గాల్లో ఎగరడం, భూమికి అటువైపున్న మనిషితో పక్కనే ఉన్నట్లుగా మాట్లాడటం, అంగారక గ్రహం మీదకు మనుషులను పంపే ప్రయత్నం జరగడం.. మొదలైనవన్నీ ఒకప్పుడు అసాధ్యాలే.
కానీ ఇప్పుడు కాదు, అందుకే మీకేదైనా ఆలోచన వచ్చినపుడు అది అవ్వదేమోనని ఆ ఆలోచనను పక్కకు తోసేయకండి. కొన్ని కొన్ని సార్లు మీరలా తోసేసిన ఆలోచనలే, వేరే వాళ్ళని చేరి, వారిని ప్రపంచ విజేతలను చేస్తాయి.
అందుకే ఆలోచన మార్చుకోండి, అసాధ్యం అన్న పదాన్ని మైండ్ లోకి రానీయకండి.
ప్రేరణ
ఎవరు ఏం చేయగలరో ఎవ్వరికీ తెలియదు
ఫేస్ బుక్ కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళిన ఒక వ్యక్తి, అక్కడ రిజెక్ట్ కావడంతో, ఆ తిరస్కారంలోంచి ప్రేరణ పొంది వాట్సాప్ ని తయారు చేసి, తిరిగి అదే ఫేస్ బుక్ కంపెనీకి అమ్మేసాడు.
కంపెనీలో జాబే రాని నాకు, కంపెనీని సృష్టించే తెలివి ఉందా అని వాట్సాప్ సృష్టించిన పర్సన్ అనుకుంటే, ఇప్పుడు మనం వాట్సాప్ ని వాడేవాళ్ళమా?
అందుకే ఎవరిలోన ఏముందో ఎవ్వరికీ తెలియదు. ఎవరు ఏం చేయగలరో వారి పక్కనున్నవారికి కూడా తెలియదు. పక్కన వాళ్ళకే కాదు, ఒక్కోసారి తమకే తెలియదు.
అలాంటప్పుడే అసాధ్యం అనుకుంటారు. కానీ ఇకనుండి అలా అనుకోకండి. ఎందుకంటే అసాధ్యం అనుకుంటే ఆగిపోతావ్, ఆలోచిస్తే సాధ్యమయ్యే దారి కనిపిస్తుంది.