ప్రేరణ: నీవు చేయలేవని విమర్శించిన వాళ్ళు నీవు చేసిన పనికి ఆశ్చర్యపోతుంటే వచ్చే కిక్కే వేరు
ఈ ప్రపంచంలో చాలామందికి ఒక జబ్బు ఉంది. అదే అవతలి వాళ్ళను కిందకు లాగడం. ఇలాంటి వారు ప్రతీ పనిలోనూ నిరుత్సాహపరుస్తారు. అవతలి వాళ్ళను నిరుత్సాహ పరిచి, ఎదగకుండా చేయడమే వీరి లక్ష్యం. ఒకవేళ నువ్వు వాళ్ళ మాట విన్నావనుకో, నువ్వు నీ జీవితంలో ఎదగలేవు. ఎందుకంటే నువ్వు ఏ పని చేద్దామనుకున్నా, ఆ పని నీ వల్ల కాదని అవతలి వాళ్ళు నీకు సలహాలిస్తారు. కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తారు. నువ్వు చేద్దామనుకున్న పనికి చాలా తెలివి కావాలనో, డబ్బు కావాలనో చెబుతారు. ఈ మాటలు నువ్వు నమ్మకుండా ముందుకు సాగి అవతలి వాళ్ళ మాటలు అబద్ధాలని నిరూపించినపుడు నీకు అమితమైన సంతోషం కలుగుతుంది.
అమితమైన సంతోషం కోసం అవతలివారిని ఆశ్చర్యానికి గురి చేయాలి
అమితమైన సంతోషాన్ని నువ్వు పొందాలనుకుంటే అవతలి వాళ్ళు నువ్వు చేయలేవన్న పనిని చేసి చూపించాలి. ఇదే పాయింట్ ని చాలామంది నెగెటివ్ గానూ చూస్తారు. నువ్వు ఒకేసారి ఐదుబీర్లు తాగలేవని ఎవరైనా అంటే, ఐదు బీర్లు తాగి చూపిస్తే సంతోషం సంగతి దేవుడెరుగు, నీ ఆరోగ్యం పాడవుతుంది. జీవితంలో ముందుకు తీసుకెళ్ళే విషయాల్లో అవతలి వారి మాటలను వమ్ము చేసి నీలోని సత్తాను చూపిస్తే బాగుంటుంది. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే అవతలి వాళ్ళను సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసి, ఆ తర్వాత అసలు సామర్థ్యం తెలుసుకుని ఆశ్చర్యంలో మీరుండకుండా, అవతలి వాళ్ళను ఆశ్చర్యానికి గురి చేసేలా మీరుండాలి.