ప్రేరణ: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
నిజాయితీ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఒక మనిషికి మరో మనిషికి మధ్య గొడవ జరిగేది ఎవరో ఒకరిలో నిజాయితీ లోపించడం వలనే. చెప్పిన తేదీకి డబ్బు ఇవ్వకపోవడం గానీ, ఆపదలో ఉన్నప్పుడు సహాయపడకపోవడం గానీ.. ఇలా చాలా విషయాల్లో నిజాయితీ లేకపోవడం వల్లే ఇబ్బంది కలుగుతుంది. అయితే నిజాయితీ అనేది తనపట్ల తనకు కూడా ఉండాలి. అది లేనపుడు తనను తాను ఎప్పటికీ మోసం చేసుకుంటూనే ఉంటాడు. ఆ మోసం కారణంగా ఎల్లప్పుడూ ఓడిపోతూ ఉంటాడు. విజేతలకు ఓడిపోయేవారికి తేడా అక్కడే ఉంటుంది. రెండు నెలల్లో ఎగ్జామ్ ఉంది. బాగా చదివి రాస్తే పాసైపోయి జాబ్ వచ్చే అవకాశం ఉంది. చదవాలని నీకూ ఉంది. కానీ కుదరట్లేదు.
నిజాయితీ కోల్పోతే దేనికీ పనికిరానివాడిగా మారిపోతారు
చదవాలనే కోరిక ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగా అమ్మాయితో ఛాట్ చేయాలన్న కోరిక ఉండడంతో చదువును పక్కన పడేసి ఫోన్ లోకి దూరిపోయావు. ఫలితంగా ఎగ్జామ్ ఫెయిలైపోయావ్. అప్పుడు బాధనిపించింది. ఆ తర్వాతప్రైవేట్ జాబ్ కోసం సెర్చ్ కోసం సాఫ్ట్ వేర్ కోచింగ్ తీసుకుంటున్నావ్. కానీ నీ మనసు కోచింగ్ పైన లేదు. ఏవేవో ఆలోచనల వల్ల సాఫ్ట్ వేర్ కోచింగ్ దెబ్బతిన్నది. ఫలితంగా ఇంటర్వ్యూలో ఫెయిల్. వీటన్నింటికీ కారణం నీ మీద నీకు నిజాయితీ లేకపోవడమే. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది కాకుండా వేరే పనులు చేస్తూ ఉండడమే. ఈ సైకిల్ అన్ని పనులకూ వర్తించి చివరికి నిన్ను దేనికీ పనికిరాని వాడిగా చేసేస్తుంది. అందుకే నువ్వునుకున్న పనిని నిజాయితీగా చెయ్యి.