ప్రేరణ: ఈ ప్రపంచాన్ని మార్చేది నీ చేతలే, నీ అభిప్రాయాలు కాదు
మాటలు చెబుతూ కూర్చుంటే కొండను ఎక్కలేం, మాటలు వింటూ కూర్చున్నా కొండపై నుండి దిగలేము. ఒక మనిషిలో మార్పు రావాలంటే మాటలు సరిపోవు, చేతలు కావాలి. మాటలు మధురంగా ఉంటాయి, చేతలు కష్టంగా ఉంటాయి. ఆ కష్టం నీకు ఇష్టంగా మారినప్పుడే నీలో మార్పు వస్తుంది. నీలో వచ్చే నీ ఒక్కడి మీదే కాదు, నీ చుట్టూ ఉన్నవారి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ ప్రపంచాన్ని మార్చాలంటే మాటలు చెబుతూ కూర్చోకూడదు. ఒక విత్తనం మొక్కగా మారాలంటే, దాన్ని ఖచ్చితంగా భూమిలో నాటాలి. అలా కాకుండా విత్తనం ఎలా మొలకెత్తుతుందో తెలుసు కదా అని చెప్పి, దాన్ని భూమిలో నాటకుండా ఉంటే, ఆ విత్తనం ఎప్పటికీ మొక్కగా మారదు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
చెప్పేవాడికన్నా చేసేవాడే గొప్ప. ఎందుకంటే చేసే వాడిని చూస్తే ఆ పని ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. దురదృష్టం ఏమిటంటే, ఈ కాలంలో చెప్పేవాడినే ఎక్కువ మంది నమ్ముతున్నారు. దాని గురించి వదిలిపెడితే, చేసే వాడే ఈ ప్రపంచాన్ని మార్చగలడు. అతడిలో ఆ శక్తి ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అన్నారు. కానీ ఏమీ చేయకుండా ఏదైనా సాధించవచ్చని ఎవ్వరూ చెప్పలేదు. ఈ ప్రపంచం గురించీ, ఈ జీవితం గురించీ మీకెంత తెలిసినా మీరు చేయాల్సిన పనిని మొదలు పెట్టకపోతే ఆ పని పూర్తి కాదు. అడుగు పడితేనే గమ్యం దగ్గరవుతుంది తప్ప అక్కడే నిల్చుంటే కాదని అర్థం చేసుకోవాలి.