LOADING...
Mumbai Plumber: ప్లంబింగ్‌తో భారీ ఆదాయం.. సోషల్ మీడియాలో వైరల్ స్టోరీ
ప్లంబింగ్‌తో భారీ ఆదాయం.. సోషల్ మీడియాలో వైరల్ స్టోరీ

Mumbai Plumber: ప్లంబింగ్‌తో భారీ ఆదాయం.. సోషల్ మీడియాలో వైరల్ స్టోరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో నివసించే ఓ వ్యక్తి తన సొసైటీలో పనిచేసే ప్లంబర్ సంపాదన గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏడాదికి సుమారు రూ.18 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిసి, ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదిక రెడ్డిట్‌లో పంచుకున్నాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాత తన జీవిత నిర్ణయాలపై మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని అతను పేర్కొన్నాడు.

వివరాలు 

క్రెటా కారు.. సొంత ఊళ్లో పొలాలు!

రెడ్డిట్‌లో అతను వివరించిన ప్రకారం,ఈ ప్లంబర్ ముంబైలోని మీరా రోడ్, బోరివలి, కాండివలి ప్రాంతాల టౌన్‌షిప్‌లలో పని చేస్తుంటాడు. ఒకసారి పైపులు మరమ్మత్తు చేస్తున్న సమయంలో మాట్లాడుతుండగా తన ఆదాయం గురించి చెప్పాడు. మొదట అతని మాటలు సరదాగా చెప్పినవిగా భావించానని, కానీ తరువాత అతను స్పష్టంగా లెక్కలు చెబుతుండటంతో నిజం అర్థమై ఆశ్చర్యపోయానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ప్రాంతాల్లో చేసే పనులన్నింటి ద్వారా అతనికి ఏడాదికి దాదాపు రూ.18లక్షల ఆదాయం వస్తోందని తెలిపాడు. ఇంతటితో ఆగకుండా, ఆ ప్లంబర్ దగ్గర 2023 మోడల్ హ్యుందాయ్ క్రెటా కారు ఉండటమే కాకుండా, తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకోవడంతో పాటు వ్యవసాయ భూమి కూడా కొనుగోలు చేసినట్లు తెలిసి అతను మరింత ఆశ్చర్యపోయాడు.

వివరాలు 

బ్లూ కాలర్ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్..!

ఈ పరిస్థితి చూసి, "అతను నిజంగానే మంచి స్థాయికి చేరుకున్నాడు. మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామో అనిపిస్తోంది," అని తన భావాలను వ్యక్తం చేశాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వంటి శారీరక శ్రమతో కూడిన బ్లూ కాలర్ పనులను యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేవని చాలా మంది అభిప్రాయపడ్డారు. ముంబైలోనే ఇలా ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్లంబర్ల ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని ఒక యూజర్ వ్యాఖ్యానించాడు.

Advertisement

వివరాలు 

చిన్న పనికైనా కనీసం రూ.500 వరకు వసూలు..

దిల్లీలో ఎయిర్ కండిషనర్ సర్వీసింగ్ చేసే వారు వేసవి కాలంలో మూడు నెలల్లోనే రూ.3 లక్షల వరకు సంపాదించి, మిగిలిన సమయం స్వగ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నారని మరొకరు పేర్కొన్నారు. చిన్న పనికైనా కనీసం రూ.500 వరకు వసూలు చేస్తున్నారని, సరైన నైపుణ్యం ఉంటే ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి సంపాదన గురించే కాకుండా, మారుతున్న కాలంలో నైపుణ్యాధారిత వృత్తుల ప్రాధాన్యత ఎంతగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తోంది.

Advertisement