Tasty Food: టమాటా-మునగాకు రోటీ పచ్చడి.. ఒక్క ముద్దతో వర్షాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు
ఈ వార్తాకథనం ఏంటి
మునగాకుతో చేసే రోటీ పచ్చడి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. సరైన కొలతల్లో, చాలా సులభమైన విధానంలో ఇంట్లోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అన్నంతో ఒక్క ముద్ద తిన్నా చాలు.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్రా శైలిలో టమాటా, మునగాకుతో రుచికరమైన రోటీ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి అన్నంతో మాత్రమే కాదు.. దోసె, ఇడ్లీ, చపాతీలతో కూడా అద్భుతంగా రుచిస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పచ్చడికి అవసరమైన పదార్థాలు ఇవి.
వివరాలు
కావాల్సిన పదార్థాలు ఇవే..
మునగాకు
టమాటాలు
పల్లీలు
పచ్చిమిర్చి
జీలకర్ర
నువ్వులు
కరివేపాకు
చింతపండు
వెల్లుల్లి రెబ్బలు
అల్లం ముక్కలు
శనగపప్పు
ఆవాలు
ఎండుమిర్చి కారం
ఉప్పు
కొత్తిమీర
నూనె
వివరాలు
తయారీ విధానం ఇదే..
ముందుగా మునగాకును బాగా శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా ఆరిపోయేలా ఫ్యాన్ కింద పరచి ఉంచాలి.
అది ఆరేలోపు పచ్చడికి అవసరమైన మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. దీని కోసం స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి.
నూనె వేడెక్కిన తర్వాత నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మోస్తరు మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి.
వివరాలు
ఇలా చేస్తే అదిరిపోయే రుచి..
అదే పాన్‌లో మరో కొద్దిగా నూనె వేసి ఆరిన మునగాకు, టమాటా ముక్కలను వేసి బాగా వేయించాలి.
మునగాకులోని పచ్చి వాసన పూర్తిగా పోయి, టమాటా మెత్తబడే వరకు వేగనివ్వాలి.
దీంతో పచ్చడికి మంచి రుచి వస్తుంది. అనంతరం రెండు చిన్న అల్లం ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించి, ఈ మిశ్రమాన్ని కూడా చల్లారనివ్వాలి.
ఇప్పుడు ముందుగా వేయించిన పల్లీలు-పచ్చిమిర్చి మిశ్రమాన్ని రోటీలో లేదా మిక్సీలో కొద్దిగా బరకగా దంచుకోవాలి.
ఆ తర్వాత అందులో మునగాకు-టమాటా మిశ్రమాన్ని వేసి, ఉప్పు, కారం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
వివరాలు
అద్భుతమైన పచ్చడిని ఆస్వాదించండిలా..
చివరగా స్టవ్‌పై చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లితో తాలింపు సిద్ధం చేయాలి.
ఈ తాలింపును పచ్చడిపై పోసి బాగా కలపాలి. అంతే.. ఘాటైన రుచి, అద్భుతమైన సువాసనతో టమాటా-మునగాకు రోటీ పచ్చడి సిద్ధం.
ఈ పచ్చడి అన్నం, ఇడ్లీ, దోసె, చపాతీలతో ఎంతో రుచిగా ఉంటుంది.
మునగాకు తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని ఆస్వాదిస్తూ తింటారు.