Page Loader
National Girl Child Day 2025: జాతీయ బాలికా దినోత్సవం 2025 స్పెషల్.. చరిత్ర,నేపథ్యం, ప్రాముఖ్యతలివే
జాతీయ బాలికా దినోత్సవం 2025 స్పెషల్.. చరిత్ర,నేపథ్యం, ప్రాముఖ్యతలివే

National Girl Child Day 2025: జాతీయ బాలికా దినోత్సవం 2025 స్పెషల్.. చరిత్ర,నేపథ్యం, ప్రాముఖ్యతలివే

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై అవగాహన కల్పిస్తూ, లింగ పక్షపాతం తొలగిస్తూ, బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది 2025లో జాతీయ బాలికా దినోత్సవం శుక్రవారం (జనవరి 24) జరుపుకుంటున్నారు. ఈ రోజుని ఎందుకు ఎంచుకున్నారో, ఎప్పటి నుంచి జరుపుతున్నారో, ఈ ఏడాది థీమ్ ఏంటి అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

జాతీయ బాలికా దినోత్సవం చరిత్ర ఇదే 

భారత ప్రభుత్వం 2008 నుంచి జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అయితే జనవరి 24న ఎందుకు జరపాలని నిర్ణయించారంటే, 1966లో జనవరి 24న ఇందిరా గాంధీ భారత ప్రధమ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో అత్యున్నత పదవికి ఒక మహిళా తొలిసారి ప్రవేశించిన రోజు కావడం వల్ల ఈ తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా 2008లో జనవరి 24న ప్రారంభించారు. బాలికలపై సమాజంలో ఉన్న వివక్షను తొలగించి, వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం.

వివరాలు 

ప్రాముఖ్యత

జాతీయ బాలికా దినోత్సవం సమాజంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మూసధోరణులు, మూఢనమ్మకాలు, మూసపద్ధతులను సవాలు చేస్తుంది. 2025 వచ్చినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలపై ఇప్పటికి వివక్ష ఉంది.వారిని చదువులో, ఉద్యోగంలో,పెళ్లిలో వెనక్కి లాగే వారు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా, లింగ వివక్ష, బాల్య వివాహాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి, బాలికలకు అవసరమైన మద్దతు ఇవ్వడం ఈ రోజుని జరుపుకునే ప్రధాన ఉద్దేశ్యం. కుటుంబాలు, సమాజం, దేశాన్ని నిర్మించడంలో ఆడపిల్లలు ఎంత ముఖ్యమైనవో తెలియజేస్తూ జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంలో వివిధ రంగాలలో యువతులు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేస్తూ, మరింత మందికి అవగాహన కల్పించడమే దీని ముఖ్య లక్ష్యం.

వివరాలు 

జాతీయ బాలికా దినోత్సవం 2025 థీమ్

ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ ఏడాది 2025కి "Empowering Girls, Empowering India" అనే కొత్త థీమ్‌ను ప్రకటించారు. ఈ రోజు సమాన ప్రాథమిక హక్కులను అందించడం, సమానత కల్పించడం మీద దృష్టి పెట్టుతుంది. ఈ ఏడాది మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బేటీ బచావో బేటీ పఢావో పథకానికి 10వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, జనవరి 22, 2025 నుండి 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.